చంద్రబాబు కూడా పార్టీ పెట్టలేదు.. కానీ! | Pawan Kalyan Says That Chandrababu Also Not Establishes A Party | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కూడా పార్టీ పెట్టలేదు: పవన్

Published Sun, May 20 2018 6:11 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Pawan Kalyan Says That Chandrababu Also Not Establishes A Party - Sakshi

సాక్షి, ఇచ్చాపురం : వచ్చే ఎన్నికల్లో తాను గెలుస్తానో లేదో తెలియదని, అయితే ప్రజలను మాత్రం మోసం చేయనని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.  తమకు ఆర్గనైజేషన్ లేదని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు కానీ జనసైనికులంతా ఓ వ్యవస్థీకృత సంస్థలాగ పని చేస్తుందని తెలిపారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నిజంగా అమలవుతాయా అని అడిగితే.. తనను నమ్మాలంటూ ఏపీ సీఎం సూచించినట్లు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఏర్పాటుచేసిన సభలో పవన్ మాట్లాడుతూ.. టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను ప్రస్తావించారు.  2014 ఎన్నికల్లో టీడీపీకి అనుభవం ఉందని నమ్మానని.. టీడీపీ నుంచి ఏ పదవి, కాంట్రాక్టులు తాను కోరుకోలేదన్నారు. హామీలివ్వడం మాత్రం టీడీపీకి అలవాటైందని ఎద్దేవా చేశారు.

‘రాజకీయ పార్టీని స్థాపించడంలో చాలా కష్టాలుంటాయి. అంతేందుకు ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు సైతం పార్టీని స్థాపించలేదు. దివంగత నేత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే అందులోకి చంద్రబాబు వెళ్లారు. జనమే నా బలం. హెరిటేజ్‌లాగా నాకు ఓ సంస్థ అంటూ ఏదీ లేదు. అయినా ముందడుగు వేశాను. రెండేళ్లూ పనిచేశాక రాజకీయాలపై అవగాహన వచ్చింది. డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదు. సేవ చేయడానికి వచ్చాను. మీ కష్టాలు అర్ధం చేసుకుంటాను. గత ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చారు. నెగ్గిన అనంతరం చంద్రబాబు వెనుకబడిన ఉత్తరాంధ్రకు అండగా ఉంటారని భావించా. కానీ అలా జరగలేదు.

పుష్కరాలకు 2వేల కోట్లు ఖర్చు చేశారు. విదేశీ పర్యటనలకు టీడీపీ ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ కిడ్నీ రోగులకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. సోంపేటలో రొయ్యల చెరువు పేరుతో కాలుష్యం చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌లోనూ మొండిచేయి చూపారు. నేను మాత్రం సమస్యల మీద నిజాయితీగా మాట్లాడుతా, పోరాడుతా. ఇప్పటికీ శ్రీకాకుళం ఇంకా వెనుకబడి ఉంది. కిడ్నీ రోగుల కోసం హార్వర్డ్ యూనివర్సిటీ వైద్యులను తీసుకొస్తే ఆ నివేదికను పక్కన పడేసారు. ఇష్టానికి మమ్మల్ని బెదిరిస్తే తిప్పికొడతాం. 3లక్షల మంది మత్స్యకారుల జీవితాలు అగమ్యగోచరంగా ఉన్నాయంటూ’ పవన్ ఆందోళన వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement