చంద్రాలు.. పవనాలు.. రహస్య ఒప్పందాలు! | Pawan kalyan Secret Alliance With Chandrababu | Sakshi
Sakshi News home page

ఈ బంధం ఎంతో బలమైనది

Published Thu, Apr 4 2019 9:01 AM | Last Updated on Thu, Apr 4 2019 12:07 PM

Pawan kalyan Secret Alliance With Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి : ఇస్తినమ్మ వాయనం... పుచ్చుకుంటి వాయనం.. అన్నట్టుగా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగుదేశం, జనసేనల మధ్య బంధం మరింత బలపడుతూ ఇచ్చిపుచ్చుకోవడాలు మరింత ఎక్కువయ్యాయి. ప్రచారంలోనూ చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ పరస్పర సహకారం, సమన్వయంతోనే ముందుకు వెళుతున్నారు. చంద్రబాబు డైరెక్షన్‌ ప్రకారమే పవన్‌ తన ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ సహా టీడీపీకి కీలకమైన నియోజకవర్గాల్లో ప్రచారానికి పవన్‌ కల్యాణ్‌ దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో చంద్రబాబు కూడా పవన్‌కల్యాణ్‌ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రచారానికి వెళ్లకపోవడం గమనార్హం. మరోపక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ వైపు మళ్లరాదన్న ఉద్దేశంతో కొన్ని నియోజకవర్గాల్లోనే పవన్‌ ప్రచారం నిర్వహిస్తున్నారు. బాబు, పవన్‌ల మధ్య బంధాన్ని టీడీపీ నేతలే అంగీకరిస్తున్నారు. వీరిద్దరి మధ్య రహస్య పొత్తు ఉందని, ఒక అవగాహనతోనే పవన్‌ వ్యవహరిస్తున్నారని జనసేన వర్గాలు కూడా వెల్లడిస్తుండటం గమనార్హం. 

ఆది నుంచీ బాబు చెప్పినట్లే పవన్‌ అడుగులు
వాస్తవానికి పవన్‌కల్యాణ్‌ తొలినుంచీ కూడా చంద్రబాబు సూచనల మేరకే నడుచుకుంటున్నారు. జనసేన ఎవరితో పొత్తులు కుదుర్చుకోవాలి? ఎవరెవరిని ఎక్కడ అభ్యర్థులుగా నిలపాలి? ఇలా.. ఎన్నికల ప్రాథమిక దశలో అన్ని అంశాలూ చంద్రబాబునాయుడి దర్శకత్వంలోనే నడిచాయి. పవన్‌కల్యాణ్‌ కలుస్తానంటే గతంలో అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వని బహుజన సమాజ్‌ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి.. చంద్రబాబు రాజకీయానికి తలొగ్గి జనసేనతో పొత్తుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. అలాగే సీపీఐ, సీపీఎంలకు ఎన్నెన్ని సీట్లు ఇవ్వాలి? పొత్తులో భాగంగా ఇచ్చే సీట్లు ఎక్కడెక్కడ ఇవ్వాలో కూడా చంద్రబాబే నిర్ణయించారు. చివరకు ఆయా స్థానాల్లో ఆయా పార్టీల అభ్యర్థుల ఎంపికలోనూ చంద్రబాబు సూచనల మేరకే పవన్‌కల్యాణ్‌ నడుచుకున్నారు. తెలుగుదేశం సూచనల మేరకు విజయవాడ పార్లమెంటుతో సహా పలు నియోజకవర్గాల్లో వామపక్షాలకు కేటాయించిన స్థానాలనూ మార్పుచేసి తన అభ్యర్ధులను చివరి నిమిషంలో ప్రకటించి పవన్‌కల్యాణ్‌ పొత్తులకు కూడా తూట్లు పొడవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇక జనసేన అభ్యర్థులను సైతం చంద్రబాబు చెప్పినట్టే పవన్‌ ఎంపికచేశారు. కొన్నిచోట్ల డమ్మీ అభ్యర్థులను పెట్టారు. మరికొన్ని చోట్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి ప్రధాన ప్రతిపక్షానికి పడకూడదనే ఎత్తుగడతో అభ్యర్థులను నిలబెట్టారు.

అప్పుడు ప్రగల్భాలు .. ఇప్పుడు సహకారం 
పవన్‌ కల్యాణ్‌ అంటే ఎవరో తనకు తెలియదని టీడీపీ నేత అశోక్‌ గజపతిరాజు గతంలో వ్యాఖ్యానించారు. దాంతో ఊగిపోయిన పవన్‌ ఆ తర్వాత విజయనగరం జిల్లాలో అశోక్‌ గజపతిరాజు కోట ఎదురుగా నిలబడి తన సత్తా ఏంటో త్వరలో ఎన్నికల్లో చూపిస్తానని సవాల్‌ విసిరారు. నిజంగానే పవన్‌ కల్యాణ్‌ ఈ ఎన్నికల్లో అశోక్‌ గజపతిరాజుని ఓడించడానికి పనిచేస్తారని అంతా భావించారు. తీరా ఎన్నికలొచ్చేసరికి తెలుగుదేశంతో కుమ్మక్కయ్యారు. విజయనగరం ఎంపీగా పోటీచేస్తున్న అశోక్‌ గజపతిరాజుపై పక్క జిల్లాకు చెందిన, అసలు ఎవరికీ పరిచయమే లేని ముక్కా శ్రీనివాస్‌ అనే డమ్మీ అభ్యర్థిని జనసేన తరఫున నిలబెట్టారు. ఆ అభ్యర్థెవరో విజయనగరం ప్రజలకు కాదు.. కనీసం జనసేన కార్యకర్తలకు కూడా తెలియకపోవడం గమనార్హం.

ఇక అశోక్‌ గజపతిరాజు కుమార్తె అదితి గజపతి విజయనగరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈమెపై కూడా పవన్‌  డమ్మీ అభ్యర్థిని పెట్టారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ, చింతమనేని ప్రభాకర్‌లపై పవన్‌ కల్యాణ్‌  గతంలో తరచూ విరుచుకుపడి విమర్శలు చేసేవారు. ఎన్నికలొచ్చేసరికి చంద్రబాబుకు తలొగ్గారు. మంత్రి గంటాపై ఓ సాధారణ అభ్యర్థి అయిన ఉషా కిరణ్‌ను నిల్చోబెట్టారు. అక్కడితో ఆగకుండా గంటా కోరిక మేరకు జనసేన అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన తోడల్లుడు పరుచూరి భాస్కరరావును నిలబెట్టారు. గంటా లాంటి వాళ్లు చిరంజీవిని ముంచేశారని గతంలో పేర్కొన్న పవన్‌.. ఇప్పుడు టీడీపీ నేతలు చెప్పినట్లు నడచుకోవడంపై జనసేన కార్యకర్తల్లోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై గతంలో ఏ జిల్లాలో పర్యటించినా పవన్‌ కల్యాణ్‌ విమర్శలు గుప్పించేవారు. ఇప్పుడు దెందులూరులో పోటీచేస్తే ఓడిస్తానంటూ తనను సవాల్‌ చేసిన చింతమనేని పేరు ఎత్తడానికి కూడా పవన్‌ సాహసించడం లేదు. పైగా అక్కడ ఓ సాధారణ మహిళా అభ్యర్థిని బరిలో పెట్టి ప్రభాకర్‌కు తెరవెనుక సహకారం అందించడంపై పవన్‌ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. పవన్‌ తమతోనే ఉన్నాడని టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌పై పేర్కొనగా.. తొలుత పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దంటూ ఊగిపోయి.. ఇటీవల కర్నూలు వెళ్లి టీజీపై తనకు కోపం లేదంటూ టీడీపీకి మద్దతుగా మాట్లాడారు. టీజీ పరిశ్రమల కాలుష్యంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారని గతంలో ఆరోపించిన పవన్‌ ఇప్పుడు ఆ మాటే ఎత్తక పోవడం గమనార్హం. కాగా చంద్రబాబు కూడా పవన్‌కల్యాణ్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ ఆయన పోటీచేస్తున్న భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో ప్రచారానికి దూరంగా ఉండటం గమనార్హం. 

తన తల్లిని తిట్టించిన లోకేశ్‌తో పవన్‌ రాజీ 
ఏడాది కిందట సినీనటి శ్రీరెడ్డి తనపై, తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై పవన్‌ తీవ్రంగా మండిపడ్డారు. దీనివెనుక ముఖ్యమంత్రి తనయుడు లోకేశ్, ఇతర తెలుగుదేశం నాయకులు ఉన్నారని అన్నారు. తన తల్లిని ఓ మహిళతో అసభ్యంగా తిట్టించగా.. ఆ వ్యాఖ్యలను చంద్రబాబు అనుకూల ఎల్లో మీడియా విస్తృత ప్రచారం చేసిందని విరుచుకుపడ్డారు. కొన్ని ఛానళ్లను, పత్రికలను బహిష్కరించడమే కాకుండా పవన్‌ ఆవేశపూరిత ట్వీట్లూ చేశారు. లోకేశ్‌ రూ.10 కోట్లు ఖర్చు పెట్టి తన తల్లిని తిట్టిస్తున్నారని, చంద్రబాబు, లోకేశ్‌లకు అత్యంత సన్నిహితంగా ఉంటూ ఆర్థిక లావాదేవీలు చూసే కిలారు రాజేష్‌ ఆ ఎపిసోడ్‌ మొత్తం నడిపించారని ట్వీట్‌ చేశారు. ఇంతా చేసిన పవన్‌..లోకేశ్‌ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో మాత్రం జనసేన అభ్యర్థిని నిలపలేదు. ఇక చంద్రబాబు పోటీచేస్తున్న కుప్పంలో పేరూ, ఊరూ లేని ఓ వ్యక్తిని బరిలో దింపారు. ఆ రెండు నియోజకవర్గాల్లో ప్రచారాన్నీ మానుకున్నారు. దీంతో రాజకీయం కోసం కుటుంబ గౌరవాన్ని సైతం పవన్‌ పణంగా పెట్టారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement