పవన్‌కల్యాణ్
సీతమ్మధార(విశాఖ ఉత్తర): విశాఖలో టీడీపీ నాయకులకు అవకాశమిస్తే డాల్ఫిన్ కొండలను సైతం మింగేస్తారని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ధ్వజమెత్తారు. విశాఖలో అధికార పార్టీ నేతలు భూములను దోచేస్తున్నారని, చేతులు కట్టుకుని చూస్తూ కూర్చోమని హెచ్చరించారు. పోర్టు కళావాణి ఆడిటోరియంలో గురువారం జనసేన పార్టీలో పలువురు నాయకుల చేరిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ అన్నీ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చానని, పరిస్థితులు అర్థం చేసుకొని తెలుగు రాష్ట్రాలకు సరికొత్త రాజకీయ ఆలోచన అవసరమని పార్టీ పెట్టినట్టు చెప్పారు. చిరంజీవి స్థాయి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే పెనుమార్పులు వస్తాయని భయంతో ఆయన కుటుంబంపై దాడి చే యడం మొదలుపెట్టారని ఆరోపించారు. పార్టీకి కులం అంటగడుతున్నారని, మీరు పార్టీలు పెడితే కులాలు రావు, మేము పార్టీలు పెడితే కులాలు గుర్తుకు వస్తాయా అని ప్రశ్నించారు.
టీడీపీ వారే వచ్చి మద్దతు అడిగారు..
2014 ఎన్నికల్లో సాయం చేయమని టీడీపీ వారే తన దగ్గరకు వచ్చారని, రాష్ట్ర భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని సపోర్టు చేశానని పవన్ చెప్పారు. ప్రజలకు మంచి పాలన అందించాలని, లేని పక్షంలో ప్రశ్నిస్తానని చంద్రబాబుకు ఆ రోజే చెప్పానన్నారు. రాజకీయ నాయకులు తలచుకుంటే ఒక్క సంతకంతో అన్నీ మారిపోతాయని, ఒక్క పెన్ను పోటుతో ఉత్తరాంధ్రలో 23 వెనకబడిన కులాలను తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగించడమే ఇందుకు నిదర్శనమన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఏమైనా దిగివచ్చారా, మేం వారికి బానిసగిరీ చేస్తున్నామా.. చొక్కాలు పట్టుకుని రోడ్లపైకి లాగుతానని ఆయన హెచ్చరించారు.
ఎమ్మెల్యే అయినా అతని కొడుకైనా చట్టానికి లోబడి ఉండాల్సిందేనన్నారు. ఉత్తరాంధ్రలో భూములను టీడీపీ పాలనలో అన్యాక్రాంతమవుతున్నాయని విమర్శించారు. వేల కోట్ల డబ్బులు తినేస్తుంటే కడుపుమండుతుందన్నారు. రాజ్యాంగ పరిధికి లోబడి ఉండాలని, పిచ్చిపిచ్చి వేషాలు వేయొద్దని టీడీపీ నాయకులను పవన్ హెచ్చరించారు. అనంతరం పలు పార్టీలకు చెందిన నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ, ఆలీవర్‌రాయి(క్యాథరిన్ ఎడ్యుకేషనల్ సొసైటీ, భీమిలి), బొగ్గు శ్రీను, డా.ఎం.మురళీ, గుంటూరు భారతి, గుంటూరు నర్సింహమూర్తి, వెంకటేశ్వరావుతో పాటు 15 మందికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
ప్రభుత్వ దోపిడీలే పోరాటాల వైపు నడిపించాయి
గాజువాక : తాను ఓట్లు కోసం రాలేదని, తన కలల కోసం వచ్చానని, ప్రజల కలలను తెలుసుకోవడానికి వచ్చానని పవన్ కల్యాణ్ చెప్పారు. గాజువాకలో గురువారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తాను పారిపోయేవాడిని కాదని, నిలబడి పోరాడేవాడినని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న దోపిడీలే తనను పోరాటం వైపు నడిపించాయన్నారు. ప్రభుత్వానిది దుర్మార్గమని, జనసేనది సన్మార్గమని పేర్కొన్నారు. ప్రభుత్వ దోపిడీలను ప్రశ్నిస్తే తమపై కేసులు పెట్టిస్తున్నారని, జన సైనికులను జైళ్లలో పెట్టిస్తున్నారన్నారు. తాటాకు చప్పుళ్లకు తాను బెదిరిపోనని, ఇంకా బలంగా వస్తానని చెప్పారు. హోదా కోసం చోటుచేసుకున్న వాదనవల్ల తిరుపతిలో తమ జన సైనికుడిని చంపేశారని ఆరోపించారు. తాను తగ్గి మాట్లాడతానని, తల వంచుతానని, అవసరమైతే తల కూడా తీస్తానని హెచ్చరించారు.
కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే కేంద్రం నుంచి రూ.3,500 కోట్ల నిధులు వచ్చేవన్నారు. ఓడిపోతామనే భయంతో ప్రభుత్వం ఎన్నికలను జరగనివ్వలేదని ఆక్షేపించారు. ఆ నిధులు కూడా తమకు దక్కకుండా పోతాయనే అడ్డుపడ్డారన్నారు. విద్య కావాలన్నా, ఉపాధి కావాలన్నా రాజకీయాల్లో భాగమవ్వాలని పిలుపునిచ్చారు. స్టీల్‌ప్లాంట్‌కు భూములను త్యాగం చేసిన రైతు కుటుంబాలు ఇప్పుడు అదే భూముల్లో కూలీలుగా పని చేస్తున్నారన్నారు. 2050 వరకు టీడీపీని ఎలా నడపాలో ప్రణాళిక వేసిన చంద్రబాబు ప్రజల సమస్యల పరిష్కారానికి మాత్రం ప్రణాళిక వేయలేదని ఎద్దేవ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, స్థానిక నాయకులు తిప్పల రమణారెడ్డి, కోన తాతారావు, గడసాల అప్పారావు పాల్గొన్నారు.
నార్త్ ఇండియన్స్‌తో భేటీ
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): నగరంలోని ఓ హోటల్‌లో నార్త్ ఇండియన్స్‌తో పవన్ భేటీ అయ్యారు. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్నారు కాబట్టి ప్రజలకు అండగా ఉంటారని 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చానని పవన్ చెప్పారు. విశాఖలో భూకబ్జాలు, కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్నారని, రాజకీయాలంటే వేల కోట్ల సంపాదన, గుండాగిరీ అన్న స్థాయికి దిగజార్చారని దుయ్యబట్టారు. సమస్యలపై పోరా టంలో జనసేనకు మద్దతు ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment