సాక్షి, తూర్పు గోదావరి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విమర్శలు చేసేముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకసారి ఆలోచించాలని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా ఎపీ సీఎం చంద్రబాబునాయుడు చేస్తున్న దోపిడి పవన్‌కు తెలియదా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు పవన్ భాగస్వామిగా ఉన్నారని, బాబు దోచిన దాంట్లో భాగస్వామ్యం ఇచ్చారో.. లేదో.. పవన్ సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు దోపిడీ పాలనలో ప్రజల కష్టాలు తెలుసుకుని, వారికి బరోసా ఇచ్చేందుకే జగన్ పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. గత నాలుగున్నరేళ్ళుగా ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా అన్యాయం చేశాయన్నారు.
విభజన చట్టంలో ప్రధాన అంశాలను అమలు చెయ్యకుండా వంచన చేశాయని మండిపడ్డారు. గత నాలుగున్నరేళ్లుగా కేంద్రంలో పదవులు అనుభవించిన టీడీపీ.. ఇప్పుడు ప్రజల్లో హోదా సెంటిమెంట్ ఉందని గమనించి కొత్త డ్రామాకు తెర తీసిందన్నారు. చంద్రబాబు ధర్మపోరాటం అని చెప్పి అధర్మపోరాటం డ్రామాలేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ చిత్తశుద్ధితో పోరాటం చేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్‌డీఏపై అవిశ్వాస తీర్మాణం పెట్టి.. చివరకు తమ ఎంపీ పదవులకు కూడా రాజీనామా చేసి ఆమరణ దీక్ష చేశామని పేర్కొన్నారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని, ఇంత మోసం చేసేందుకా టీడీపీకి అధికారాన్ని కట్టబెట్టాము అని ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment