
నలుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘటన పయ్యావుల స్వగ్రామమైన కౌకుంట్లలో మంగళవారం జరిగింది.
సాక్షి, అనంతపురం : ఓటుతో ప్రజలు టీడీపీ నాయకులకు గట్టి గుణపాఠం చెప్పినా.. వారి తీరు మారడం లేదు. ఓటమిని జీర్ణించుకోలేని పచ్చ పార్టీ నేతలు రౌడీయిజం చేస్తున్నారు. తమ పార్టీకి కాకుండా వైఎస్సార్‌సీపీకి ఓట్లేశారని పేర్కొంటూ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వర్గీయులు రెచ్చిపోయారు. నలుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘటన పయ్యావుల స్వగ్రామమైన కౌకుంట్లలో మంగళవారం జరిగింది.
కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో వెంకటేష్, గంగమ్మ, గంగాధర్, ఎర్రిస్వామికి గాయాలయ్యాయి. బాధితులు ఉరవకొండ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ‘మీరంతా ఎవరికి ఓటు వేశారో ఈవీఎంలలో తెలిసిపోయింది’అని బెదిరిస్తూ పయ్యావుల వర్గీయులు దాడి చేయడం గమనార్హం. ఇక శింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు మండలం ఏ.కొండాపురంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. టీడీపీ నేతలు దాడిచేయడంతో వైఎస్సార్‌సీపీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు గాయపడ్డారు. వారిని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.