మాట్లాడుతున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, హాజరైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు
హసన్‌పర్తి (వరంగల్): ఓటమి భయంతోనే టీఆర్‌ఎస్ ఆపద్ధర్మ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులపై కేసులు పెడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. హసన్‌పర్తి మండలం భీమారంలోని జీఎంఆర్ గార్డెన్‌లో శుక్రవారం నిర్వహిం చిన మేధావుల ఫోరం సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ సర్కార్ విపక్ష పార్టీలను అణచివేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. కేసులకు కాంగ్రెస్ భయపడదన్నారు.
అధికారంలోకి వచ్చాక టీఆర్‌ఎస్ నాయకుల సంగతి చూస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా వసూలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగుల తల్లిదండ్రులకూ పెన్షన్ ఇస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. పెన్షన్ పొందే అర్హతను 65 ఏళ్ల నుంచి 58 ఏళ్లకు తగ్గిస్తామని చెప్పారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి స్త్రీలకు ఇస్తున్న పెన్షన్‌ను రూ.1000 నుంచి రూ.2000, వికలాంగులకు రూ.1500 నుంచి రూ.3000కు పెంచుతామన్నారు. రాష్ట్రంలోని పది లక్షల మంది నిరుద్యోగులకు రూ.3000 చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు.
తొలి ఏడాదే లక్ష ఉద్యోగాలు..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే 20 వేల టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. బీఎల్‌ఓలు, వీఏఓలకు నెలకు రూ.10 వేల వేతనం ఇస్తామన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు పెద్ద ఎత్తున సబ్సిడీ రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులకు మద్దతు ధర కల్పిస్తామని ప్రకటించారు. వరి, మొక్కజొన్నకు క్వింటాల్‌కు రూ.2 వేలు, పత్తికి రూ.6 వేలు, పప్పులకు రూ.7 వేలు, మిర్చి, పసుపులకు రూ.10 వేలు మద్దతు ధర ఇస్తామన్నారు. పంట బీమా పథకాన్ని ప్రవేశపెట్టి, ప్రభుత్వమే అందుకు సంబంధించిన ప్రీమియంను చెల్లిస్తుందన్నారు. డ్వాక్రా మహిళా సంఘాలకు రూ.10 లక్షల వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు.
మేధావుల ఫోరం కన్వీనర్ ప్రొఫెసర్ అశోక్‌కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ డాక్టర్ వినయ్, వరంగల్ పార్లమెంట్ ఇన్‌చార్జీ శ్రీనివాస కృష్ణన్, ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పోదెం వీరయ్య, విజయరామారావు, డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్, బందెల భ«ద్రయ్య, ఈవీ శ్రీనివాస్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, బత్తిని శ్రీనివాస్, గండ్ర జ్యోతి, వీసం సురేందర్‌రెడ్డి, డాక్టర్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌దే గెలుపు : కొండా సురేఖ
వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుందని తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. కేసీఆర్ కుటుంబం మాత్రం తెలంగాణను తామే కొట్లాడి తెచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో తాము మాట్లాడిందే వేదం.. తాము చేసిందే చట్టంలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ను బొందపెట్టాలని పిలుపునిచ్చారు.
అవినీతిలో రెండో స్థానం : పొన్నాల
దేశంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి సర్కార్ అవినీతిలో రెండో స్థానంలో ఉందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ఉద్యమం సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పిన కేసీఆర్ ఏ ఒక్కటి కూడా చేపట్టలేదని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment