
ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్ కార్తికేయ మిశ్రా..ఇన్‌సెట్లో ఇళ్ల వెంకటేశ్వరరావు
ఒక్కో రౌండ్‌కు గంటన్నర నుంచి 2 గంటల సమయం పట్టడంతో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమవుతూ వచ్చింది.
సాక్షి, కాకినాడ సిటీ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఇళ్ళ వెంకటేశ్వరరావు (ఐవీ) విజయ పథంలో దూసుకుపోతున్నారు. రంగరాయ మెడికల్ కళాశాలలో ఎన్నికల అధికారులు బుధవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు. 7 టేబుళ్లు వేసి బ్యాలెట్ పత్రాల లెక్కింపు ప్రారంభించారు. ఒక్కో రౌండ్‌కు గంటన్నర నుంచి 2 గంటల సమయం పట్టడంతో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమవుతూ వచ్చింది. 26 రౌండ్లు ముగిసేసరికి ఐవీ రావు 91820, నల్లమిల్లి శేషారెడ్డి 37056 ఓట్లు సాధించారు. నాలుగు రౌండ్లు మిగిలి ఉండగానే ఇళ్ల వెంకటేశ్వరరావు (ఐవి) గెలుపు కోటాకు సరిపడా ఓట్లు సాధించారు. 26 రౌండ్లకు 1,82,000 ఓట్లు లెక్కించగా, ఇళ్ళ వెంకటేశ్వరరావు 54,764 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. ఇంకా కేవలం రెండు రౌండ్లు మాత్రమే లెక్కించాల్సి ఉంది.
మిగిలిన ఓట్ల లెక్కింపు, ఐవీ గెలుపొదినట్టు అధికారిక ప్రకటన వెలువడడం ఇక లాంఛనమే. మధ్యాహ్నానికి అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ నెల 22న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 46 మంది అభ్యర్థులు పోటీ చేయగా ఉభయ గోదావరి జిల్లాల్లో నమోదైన పట్టభద్రుల ఓటర్లు 1,92,137 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అతి తక్కువ మంది మూడంకెల స్థానంలో నిలిచారు. చాలా మంది అభ్యర్థులు అంతంత మాత్రంగానే ఓట్లు పొందారు. చెల్లని ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.