
పుంగనూరు (చిత్తూరు జిల్లా): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ తమకు పదిరూపాయలు ఆదాయం వస్తుందంటే ఎక్కడైనా సంతకాలు పెట్టేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. హంద్రీనీవా పనులు పూర్తి కాకపోయినా ఎన్నికల కోసం ప్రజలను మోసగించేందుకు చాలీచాలని నీళ్లు విడుదల చేశారన్నారు. నవరత్నాల కార్యక్రమాలను కాపీకొట్టి, ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలను మోసగించేందుకు వస్తున్న తెలుగుదేశం పార్టీ వారికి తగిన గుణపాఠం చెప్పాలని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం పుంగనూరు బస్టాండులో ప్రచారం అనంతరం పెద్దిరెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు గత ఎన్నికల్లో రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఏమీ చేయకుండా ఐదేళ్లు కాలం గడిపేశారన్నారు.
రాజధాని అమరావతిలో అన్నీ తాత్కాలిక భవనాలేనని, ఇందు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, కమీషన్ల పేరుతో ప్రభుత్వ నిధులు స్వాహా చేశారన్నారు. 33 వేల ఎకరాల రైతుల భూములను బలవంతంగా లాక్కుని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఘనుడు చంద్రబాబునాయుడు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే అధికారంలోకి వచ్చిన మొదట్లోనే పెన్షన్లు, పసుపు కుంకుమ, నిరుద్యోగ భృతి ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమని, జగన్ ముఖ్యమంత్రి కాగానే తన తండ్రి రాజన్న పాలనను తిరిగి కొనసాగిస్తారని అన్నారు.
ప్రజలు మాయమాటలకు లొంగకుండా, పనిచేసే వారిని గుర్తించి ఓట్లు వేయాలన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు కొండవీటి నాగభూషణం, విశ్వనాథ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, స్థానిక పార్టీ సలహాదారు నాగముని, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, జెడ్పీఫ్లోర్ లీడర్ వెంకటరెడ్డి యాదవ్, మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధీన్‌షరీఫ్, పార్టీ బూత్ కమిటీ మేనేజర్ అమ్ము తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment