
మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి. చిత్రంలో పార్థసారథి, ఉదయభాను
విజయవాడ సిటీ: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర శ్రీకాకుళం చేరేసరికి రాష్ట్ర రాజకీయాలను శాసిస్తుందని పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. చంద్రబాబు మాయమాటలు నమ్మి మోసపోయిన ప్రజలంతా జగన్ వెంట నడుస్తున్నారని తెలిపారు. తాడేపల్లి నుంచి కనకదుర్గమ్మ వారధి మీదుగా విజయవాడ చేరుకున్న సమయంలో జగన్‌కు ప్రజలు పలికిన ఘనస్వాగతమే అందుకు నిదర్శనమన్నారు. ఆదివారం విజయవాడలోని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు కొలుసు పార్థసారధి, సామినేని ఉదయభానుతో కలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలేకరులతో మాట్లాడారు.
నవంబరు 6న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర సోమవారం 2,000 కిలోమీటర్ల మైలురాయి దాటుతుందని, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం మాదేపల్లి గ్రామం ఇందుకు వేదిక కానుందని పెద్దిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జగన్ అక్కడ 40 అడుగుల స్థూపాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు. జగన్ పాదయాత్రకు లభిస్తున్న స్పందన చూసి చంద్రబాబుకు మతిభ్రమించిందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు చెప్పేదొకటి చేసేదొకటని విమర్శించారు. వడ్డీలకు సరిపోకుండా రైతులకు రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో 92 శాతం మంది రైతులు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. నిరుద్యోగ యువతకు 40 లక్షల ఉద్యోగాలు కల్పించటంతోపాటు 20 వేల పరిశ్రమలు తెచ్చామంటూ నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారన్నారని ధ్వజమెత్తారు. నిజంగానే బీజేపీతో తెగతెంపులు చేసుకుంటే అదే పార్టీకి చెందిన మహారాష్ట్ర మంత్రి భార్యను టీటీడీలో సభ్యురాలిగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. బీజేపీతో అంటకాగుతూ వైఎస్సార్ సీపీపై నిందలు వేయడం సమంజసం కాదన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు చేసిన రాజీనామాలు ఆమోదం పొందుతాయని, ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను పెద్దిరెడ్డి స్వాగతించారు. ఉప ఎన్నికలను రిఫరెండంగా భావించాలని, టీడీపీకి డిపాజిట్లు రాకంటే చంద్రబాబు తక్షణమే రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment