
అమరావతి: ఓటు హక్కు నమోదు కోసం దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 15తో గడువు ముగుస్తుందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల్‌కృష్ణ ద్వివేది తెలిపారు. ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులు ఎన్నికల అనంతరం పరిశీలించి ఓటర్ల జాబితాలో చేరుస్తామని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించబోమని స్పష్టం చేశారు. ఓటు ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ఓటరుపైనే ఉందన్నారు. ఎలాంటి ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు. అనేక మాధ్యమాల ద్వారా ఓటరు నమోదు, తనిఖీకి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఈ స్థాయిలో ఓట్లు పెరిగేందుకు ప్రజలతో పాటు అన్ని వర్గాల కృషి ఉందని వ్యాఖ్యానించారు. ఓటు నమోదు కోసం ఆన్‌లైన్‌లో సర్వర్ డౌన్ అయితే ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తులు చేయవచ్చునని సూచించారు. బూత్ లెవెల్ అధికారి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకూ దరఖాస్తు ఫారంలను నేరుగా సమర్పించవచ్చని తెలిపారు. ఏపీ ఓటర్ల నమోదులో వెనకబడి ఉందన్న వాదనలు సరికాదని అన్నారు. ఓటర్ల నమోదులో ఏపీ అన్ని రాష్ట్రాలతో సమాన స్థాయిలోనే ఉందని చెప్పారు. 7 నుంచి 9 శాతం వరకూ ఓటర్లు పెరిగే అవకాశముందని వ్యాక్యానించారు. 3.95 కోట్లకు ఓటర్ల సంఖ్య రాష్ట్రంలో చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని అన్నారు. జనవరి 11కు ముందు 20 లక్షల కొత్త ఓట్లు జాబితా చేర్చామని తెలిపారు. ఈ నెల 25వ తేదీ తర్వాత విడుదల చేయనున్న అనుబంధ ఓటర్ల జాబితా తర్వాత మరో 20 లక్షలకు పైగా ఓట్లు పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.
ఎన్నికల కోసం ప్రత్యేక బృందాల ఏర్పాటు
ఏపీలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. 6600 ఫ్లైయింగ్ స్క్వాడ్లు, 6160 స్టాటిక్ సర్వైలెన్స్ టీంలు, 31 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, 46 తాత్కాలిక చెక్‌పోస్టులు, 18 మొబైల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. వాణిజ్య పన్నుల శాఖల ఆధ్వర్యంలో 161 బృందాలతో లావాదేవీలపై నిఘా పెంచినట్లు చెప్పారు. సోషల్ మీడియాపై నిఘా కోసం జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూడు రోజుల్లో 29.91 కోట్ల నగదు, 13.57 కిలోల బంగారం, 70 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పోలీసుల తనిఖీల్లో 190 జిలెటిన్ స్టిక్స్, 50 కిలోల అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment