
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 3, 925 నామినేషన్లు... 25 ఎంపీ స్థానాలకు 548 నామినేషన్లు దాఖలయ్యాయని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. నంద్యాల ఎంపీ, అసెంబ్లీ స్థానాలకు అధికంగా నామినేషన్లు దాఖలైనట్లు పేర్కొన్నారు. అత్యధికంగా నంద్యాల ఎంపీ స్థానానికి 38 నామినేషన్లు వస్తే... చిత్తూరు ఎంపీ స్థానానికి అతితక్కువగా 13 నామినేషన్లు మాత్రమే వచ్చాయని వెల్లడించారు. ఇక 15 కంటే ఎక్కువ నామినేషన్లు 17 చోట్ల వచ్చినట్లు తెలిపారు. నంద్యాల అసెంబ్లీకి గరిష్టంగా 61... అత్యల్పంగా పార్వతీపురం, పాలకొండలో 10 నామినేషన్లు దాఖలయ్యాయని పేర్కొన్నారు. 118 నియోజకవర్గాల్లో 15 కంటే ఎక్కువ నామినేషన్లు వచ్చాయని తెలిపారు.
రాష్ట్రంలో మొత్తం 3 కోట్ల 93లక్షల 45వేల717 ఓటర్లు..
ఓటరు నమోదులో అన్ని విభాగాలు అద్భుతంగా పని చేసాయన్న గోపాలకృష్ణ ద్వివేది.. జనవరి 11 తర్వాత 25 లక్షల కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 3 కోట్ల 93లక్షల 45వేల717 ఓటర్లు ఉన్నారని తెలిపారు. సి-విజిల్ యాప్ ఫిర్యాదుల పరిశీలనకు 3,625 ఉద్యోగులు పనిచేస్తున్నారని...ఈ యాప్ ద్వారా ఇప్పటి వరకు 3614 ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. వీటిలో 40శాతం తప్పుడు ఫిర్యాదులుగా తేల్చామని తెలిపారు. ఈ నేపథ్యంలో 17 పోలీస్ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులు ద్వారా 734 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని.. తనిఖీల్లో రూ. 12 కోట్ల 13 లక్షల ఖరీదైన బంగారం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలు నేటికి పూర్తి..
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ఈ రాత్రికి పూర్తి అవుతుందని ద్వివేది పేర్కొన్నారు. ‘మొదటి రౌండ్ లో 17 వేల 293 ఓట్లు కౌంటింగ్ పూర్తయింది. ‘మొదటి స్థానంలో రఘువర్మ 7వేల 834 ఓట్లు సాధించారు. కృష్ణా-గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ రేపు ఉదయానికి పూర్తవుతుంది’ అని వెల్లడించారు. ఐటీగ్రిడ్స్ కేసు విషయంలో ఏపీ, తెలంగాణ సిట్‌కు సహకరిస్తామని.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలపై ఈ రాత్రికల్లా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment