ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేది
అమరావతి: ఈవీఎం బ్యాలెట్లలో చిన్నపొరపాటు కూడా దొర్లకుండా ఉండేందుకు ప్రతీ బ్యాలెట్‌ను రెండు మూడు మార్లు పరిశీలిస్తున్నామని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. శుక్రవారం అమరావతిలో ద్వివేది విలేకరులతో మాట్లాడారు. ఈసారి అభ్యర్థుల ఫోటోలను కూడా బ్యాలెట్లపై ముద్రించాల్సి ఉంది.. అందుకే పరిశీలనా ప్రక్రియ ఆలస్యమవుతోందని అన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈవీఎంలలో పెట్టే బ్యాలెట్ పేపర్ల ముద్రణను ప్రారంభించామని వెల్లడించారు. విజయవాడ, కర్నూలులోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లలోనే వీటిని ముద్రిస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గానికి 5 నుంచి 7 వేల వరకూ ఈవీఎం బ్యాలెట్ పేపర్లను ముద్రించాల్సి ఉందన్నారు. ప్రతీ పార్లమెంటరీ నియోజకవర్గానికి 30 వేల చొప్పున పేపర్లు అవసరం అవుతాయన్నారు.
కర్నూలు, గుంటూరు జిల్లాల్లో 30 మంది కన్నా ఎక్కువ అభ్యర్థులు బరిలో ఉండటంతో 3 బ్యాలెట్ యూనిట్లు అవసరమని, వీటిని పొరుగు జిల్లాల నుంచే సర్దుబాటు చేస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి రప్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా పూర్తిగా సిద్ధమైన తర్వాత రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని, రాజకీయ పార్టీలు పోలింగ్ తేదీకి 48 గంటల ముందే మేనిఫెస్టోను విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. దేశంలో మొదటి విడతలోనే ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రంగా ఏపీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోందని వ్యాక్యానించారు. ఎన్‌జీవోల ఓటరు చైతన్యం కోసం పారదర్శకంగా ప్రచారం చేస్తే ఇబ్బంది లేదని, పార్టీల పరంగా చేస్తే ఆ ఖర్చు సదరు పార్టీ ఖాతాలోకే వెళ్తుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment