
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు ముందే ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ కేంద్రమంత్రి చిదంబరం జైలుకు వెళ్తారని, 2019లో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి అన్నారు. ఆదివారం నగరంలో మహిళా వాణిజ్యవేత్త(ఫిక్కీ)ల గ్రూప్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలోని రాజకీయ పరిణామాలు, ఇతర కీలకాంశాలు, ఆర్థిక విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. రచయిత, కాలమిస్ట్ శ్రీరాం కర్రి అనుసంధానకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ఫిక్కీ చైర్‌పర్సన్ ప్రియాంక గనేరీవాల్ అరోరా తదితరులు పాల్గొన్నారు. ఫిక్కీ సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సుబ్రమణ్యస్వామి సమాధానాలిచ్చారు.
హార్వర్డ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేసుకుని స్వదేశంలోనే ఉద్యోగం చేయాలని వచ్చానని, నాటి ప్రధాని ఇందిరాగాంధీ సోవియట్ రష్యా విధానాల పట్ల మొగ్గు చూపడాన్ని సహించలేక తీవ్రంగా వ్యతిరేకించానని తెలిపారు. ఆమె కోపానికి బలై ఉద్యోగం కోల్పోవలసి వచ్చిందని, తర్వాత రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. నాడు ఇందిరాగాందీ, తర్వాత సోనియా, జయలలిత... ఇలా ఆడవాళ్లతోనే శత్రుత్వం ఎందుకు పెట్టుకున్నారన్న ప్రశ్నకు బదులిస్తూ తనకు మాయావతి, మమతాబెనర్జీ మంచి ఫ్రెండ్స్ అని, లింగ సమానతను నమ్ముతానని ఆయన చమత్కరించారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ పారదర్శకంగా ఉండే వ్యక్తి అని, సోనియాని పెళ్లాడటమే ఆయన చేసిన తప్పని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ చనిపోయే సమయానికి సోనియా, రాజీవ్‌ల మధ్య వాతావరణం అంత సామరస్యంగా ఏమీ లేదన్నారు.
ఆదాయపన్నుతో అవస్థలే..
ఆదాయపన్నుతో ఇబ్బందులు పడుతున్నవారు దిగువ, మధ్యతరగతి వారేనని, తాను ఆర్థికమంత్రినైతే ఆదాయపన్నును రద్దు చేస్తానని సుబ్రమణ్యస్వామి అన్నారు. దేశంలో రెవెన్యూ ఆదాయం పెంచేందుకు ఇతర మార్గాలను అన్వేషించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది మార్చి నాటికి బాబ్రీ మసీదు కేసులో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం బీజేపీలో చేరాలనుకున్నా ఆ పార్టీ తోసిపుచ్చిందని చెప్పారు. గతంలో సోనియా ప్రధాని కాకుండా ఉండేందుకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 90 శాతం పాత్ర పోషిస్తే తాను 10 శాతం పాత్ర పోషించానని, అందుకే అబ్దుల్ కలాం రెండోసారి రాష్ట్రపతి కాకుండా ఆమె అడ్డుకున్నారన్నారు. జీఎస్టీ, ఆధార్‌తో దేశప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అభిప్రాయపడ్డారు. మోదీ నియంత కాదని కితాబునిచ్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి అర్థశాస్త్రం తెలియదన్నారు. శబరిమల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించే హక్కు ఎవరికీ లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment