మీకెందుకు ఓట్లు వేయాలంటూ మండిపడుతున్న మహిళలు
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): తనను గెలిపిస్తే మీ సమస్యలు పరిష్కరిస్తానని 2014 ఎన్నికల సమయంలో వాసుపల్లి గణేష్‌కుమార్ హామీలిచ్చేశారు. దీంతో 2009 ఎన్నికల్లో మూడో స్థానంలోకి దిగజారిపోయిన వాసుపల్లిని నియోజకవర్గ ప్రజలు కనికరించారు. పోనిలే..ఈసారి అవకాశమిద్దామని 2014 లో అవకాశమిచ్చారు. అంతే అప్పటి నుంచి ప్రజా సమస్యలు గాలికొదిలేశారంటూ నియోజకవర్గంలో విమర్శలు వెల్లువెత్తాయి. పార్టీ అధిస్టానం ఈ దఫా ఎన్నికల్లో కూడా వాసుపల్లికే టికెట్ కేటాయించడంతో టీడీపీ తమ్ముళ్లే రగిలిపోతున్నారు. ప్రత్యక్షంగా..పరోక్షంగా వాసుపల్లికి దూరంగా ఉంటున్నారు.
ఇదిలా ఉండగా ఆదివారం ఎన్నికల ప్రచారానికి 21వ వార్డుకు వెళ్లిన వాసుపల్లిని వార్డు ప్రజలు అడ్డుకున్నారు. టీడీపీ నాయకులు యర్రబల్లి ప్రభాకర్, సీఎం రమణను నిలదీశారు. సీసీ రోడ్డు..అభివృద్ధి పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారాలకైతే ముందుంటారు. వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మీకు కనిపించావా? మీరు చేసిన అభివృద్ధి ఏంటి? ఐదేళ్ల కాలంలో వార్డు సమస్యలు పట్టించుకున్నారా? కమీషన్ల కక్కుర్తితో మురికివాడ ప్రాంతంగా తయారు చేశారు. మీరా..మా నాయకులు..మీకా మేము ఓట్లేసేది అంటూ ఎండగట్టారు.యువకులు, మహిళలు, వార్డు పెద్దలు వారిపై మండిపడ్డారు.
అమ్మవారి గుడి రోడ్డు వేయకుండా అడ్డుతగిలారంటూ వాగ్వాదానికి దిగారు. ఏ ముఖం పెట్టుకొని వార్డులోకి వచ్చారంటూ నిలదీశారు. వార్డు టీడీపీ అధ్యక్షుడు సీఎం రమణ వల్లే మాకు ఈ దుస్థితి వచ్చిందంటూ ఎదురుతిరిగారు. అంతేగాక వార్డు అభివృద్ధికి నిరోధకులతో వస్తే ఊరుకోమని వాసుపల్లిని హెచ్చరించారు. అన్ని పథకాల్లో దోపీడికి పాల్పడిన వారిని పక్కన పెట్టుకుని రావడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రతి పనిలో లంచాలకు మరిగిన పార్టీ సీనీయర్‌నాయకుడు యర్లబల్లి ప్రభాకర్‌ను ఎందుకు వెంట తిప్పుకుంటున్నారంటూ విరుచుకుపడ్డారు. స్థానికుల నుంచి పెద్దగా వ్యతిరేకత రావడంతో టీడీపీ తమ్ముళ్లు, వాసుపల్లికి తల తిరిగినట్టయ్యింది. పసుపు చొక్కాలు ఒక్కసారిగా తెల్లముఖం వేశాయి. దీంతో వాసుపల్లి, టీడీపీ నాయకులు అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment