కృష్ణా, మచిలీపట్నంటౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు, మంత్రి నారా లోకేష్‌బాబుకు బ్రోకర్‌గా పనిచేస్తూ ముడుపులు ఇవ్వటం తప్ప బందరుకు చేసిందేముందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రను వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రశ్నించారు. స్థానిక రామానాయుడుపేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన గురువారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మంత్రి పదవిని కాపాడుకునేందుకు లోకేష్‌కు ముడుపులు ఇచ్చి బ్రోకర్ పనులు చేశావే తప్ప బందరు పోర్టు నిర్మాణానికి నాలుగేళ్లుగా చేసిందేమిటో చెప్పాలన్నారు. బందరులో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారని పదే పదే చెప్పుకోవడం తప్ప ఒక్క పరిశ్రమకైనా శంకుస్థాపన చేశారా అని ప్రశ్నించారు. బందరులో ఉన్న ఏకైక బెల్ కంపెనీని లోకేష్ దత్తత గ్రామం నిమ్మకూరుకు తరలిస్తుంటే చూస్తూ మౌనంగా ఉన్నావన్నారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో పోర్టు నిర్మాణానికి రూపొందించిన మ్యాప్‌లను చూస్తూ ఫొటోలు దిగి ప్రచారం పొందటం తప్ప పోర్టు కోసం చేసిన కృషి చెప్పాలన్నారు. పోర్టు, అనుబంధ పరిశ్రమలకుగానూ 33వేల ఎకరాల భూమిని సేకరించేందుకు జారీ చేసిన నోటిఫికేషన్ వల్ల రుణాలు రాక, భూముల క్రయవిక్రయాలు జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. చందన మస్తానరావు హైకోర్టును ఆశ్రయించగా, నోటిఫికేషన్ ద్వారా భూములు తీసుకోవటం లేదని కలెక్టర్ హైకోర్టుకు లేఖ రాశారని, ఈనెల 3వ తేదీన హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు. ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడటం ఏమిటని ప్రశ్నించారు. తనను గెలిపిస్తే సొసైటీ భూమికి పట్టాలు ఇప్పిస్తానని కుమ్మరిగూడెం కుమ్మరులను ప్రాథేయపడి తీరా అధికారం వచ్చాక సొసైటీ భూమిలోనే స్టేడియం నిర్మించాలని చూడడం న్యాయమా అని ప్రశ్నించారు. పేద వర్గాలపై అధికార జులుం ప్రదర్శిస్తే వారికి అండగా ఉంటానే తప్ప ఎవరికీ భయపడేది లేదన్నారు. కాంట్రాక్టర్లు నీ మామ, మాజీ మంత్రి నడకుదుటి నరసింహారావుకు, నీకు ముడుపులు చెల్లిస్తేనే పనులు చేయిస్తున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బీచ్ ఫెస్టివల్ పేరుతో కోట్లాది రూపాయలు దండుకోలేదా అని ప్రశ్నించారు. నీరు అందక రైతులు సాగు కూడా చేయలేని పరిస్థితులు ఉన్నా మీరు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఇవే పట్టని మీరు అభివృద్ధికి నేను అడ్డుపడుతున్నానని ప్రజలకు అబద్ధాలు చెప్పడం సరికాదని నాని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment