కేంద్రంలో అధికారంలోకొస్తే..జీఎస్టీలోకి పెట్రో ధరలు | Petrol prices in GST if Congress Wins | Sakshi
Sakshi News home page

కేంద్రంలో అధికారంలోకొస్తే..జీఎస్టీలోకి పెట్రో ధరలు

Published Tue, Sep 11 2018 1:46 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Petrol prices in GST if Congress Wins - Sakshi

సోమవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతున్న టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. చిత్రంలో జానారెడ్డి తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రాహుల్‌ గాంధీ ప్రధాని అయితే పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామని టీపీసీసీ చీఫ్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. తద్వారా పెట్రోల్, డీజిల్‌తోపాటు నిత్యావసరాల వస్తువుల ధరలు తగ్గి పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలుగుతుందన్నారు. సోమవారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా, మాజీ మంత్రి జానారెడ్డి, మండలిలో విపక్ష నేత షబ్బీర్‌ అలీతో కలసి ఉత్తమ్‌ మాట్లాడారు. పెట్రో ధరల పెరుగుదలకు ప్రధాని మోదీతోపాటు సీఎం కేసీఆర్‌ కూడా బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. 2014లో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 70, డీజిల్‌ ధర రూ.55 ఉండేదన్నారు. కానీ 2018లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 85కు, డీజిల్‌ ధర రూ.79కి పెరిగిందన్నారు.

యూపీ ఏ హయాంతో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలు తక్కువగా ఉన్నా దేశంలో పెట్రో ధరలు పెరుగుతూ సామాన్యుల నడ్డివిరుస్తున్నాయ ని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చాక పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్‌ డ్యూటీ ని 12 సార్లు పెంచారని, 3.5 శాతం ఉన్న డ్యూటీ 15 శాతానికి పెరిగిందన్నారు. ఒక దేశం, ఒక పన్ను నినాదమిచ్చిన మోదీ పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తేలేదని ప్రశ్నించారు. పెట్రో ధరల తగ్గింపు కోసం కేంద్రంతో కొట్లాడాల్సిన సీఎం కేసీఆర్‌ కేంద్రంతో పోటీపడి ధరలు పెంచడం దురదృష్ట కరమన్నారు. దేశంలోని 23 రాష్ట్రాలకన్నా పెట్రోల్‌పై వ్యాట్‌ తెలంగాణలోనే ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పెట్రోల్‌పై 35 శాతం, డీజిల్‌పై 28 శాతం వ్యాట్‌ వసూలు చేస్తోందన్నారు.

కేసీఆర్‌ సీఎం అయ్యాక పెట్రోల్‌పై 4 శాతం, డీజిల్‌పై 5 శాతం పన్ను పెంచారని విమర్శించారు. పెట్రో ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌ను రాష్ట్రంలో విజయవంతమైందని ఉత్తమ్‌ తెలిపారు. బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారంటూ వారికి కృతజ్ఞతలు చెప్పారు. బంద్‌ సందర్భంగా పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని ఖండించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకొచ్చాక ప్రతి పేద కుటుంబానికి ఏటా 6 వంటగ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారు. విలేకరుల సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు మధు యాష్కీ, బోసురాజు, సలీం అహ్మద్, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. 

అతిత్వరలో పొత్తు చర్చలు ప్రారంభం... 
రాష్ట్రంలో కేసీఆర్‌ దుర్మార్గ పాలనను అంతమొందించేందుకు రాజకీయ, రాజకీయేతరపక్షాలు, విద్యార్థు లు, ప్రభుత్వోద్యోగులు, ఎన్జీవోలు, మహిళలు, పౌరసమాజం తమతో కలసి రావాలని ఉత్తమ్‌ మరోసారి పిలుపునిచ్చారు. తెలుగుదేశం సహా ఇతర పార్టీలతో అతిత్వరలోనే పొత్తు చర్చలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. పొత్తులపై అందరం సమన్వ యంతో ముందుకెళ్తామన్నారు. బుధవారం ఆజాద్‌ సమక్షంలో పార్టీలో చేరికలుంటాయన్నారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంను త్వరలోనే కలుస్తామని ఓ ప్రశ్నకు ఉత్తమ్‌ బదులిచ్చారు. 

నేటి నుంచి కాంగ్రెస్‌ జెండా పండుగ... 
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మంగళవారం నుంచి ఈ నెల 18 వరకు ‘కాంగ్రెస్‌ జెండా పండుగ’నిర్వహించనున్నట్లు ఉత్తమ్‌ వెల్లడించారు. గ్రామాలతోపాటు పార్టీ కార్యకర్తల ఇళ్లు, వాహనాలపై కాం గ్రెస్‌ జెండా ఎగురవేయాలని కేడర్‌కు పిలుపునిచ్చారు. గ్రామస్థాయి సమావేశాలు ఏర్పాటుచేసి ఓటర్ల జాబితాలో మార్పుచేర్పులపై చర్చించాలని సూచించారు.

రేపు హైదరాబాద్‌కు ఆజాద్‌..
రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ బుధవారం హైదరాబాద్‌ వస్తున్నట్లు ఉత్తమ్‌ చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విలేకరుల సమావేశంలో ఆజాద్‌ పాల్గొంటారని, అనంతరం సాయంత్రం 6 గంటలకు సంగారెడ్డిలో జరిగే మైనారిటీల సదస్సుకు హాజరవుతారన్నారు.

ప్రభుత్వాలను ప్రజలు నిలదీయాలి: జానారెడ్డి 
దేశంలో, రాష్ట్రంలో పెట్రోల్, డీజీల్‌ ధరలు విపరీతంగా పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వాలను ప్రజ లు నిలదీయాలని పిలుపునిచ్చారు. భారత్‌ బంద్‌ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. మండలిలో విపక్ష నేత షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ పెట్రో ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నును తగ్గించాలని డిమాండ్‌ చేశారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు క్రూడాయిల్‌ ధర బ్యారెల్‌కు 139–140 డాలర్లుగా ఉండేదని, దీంతో అప్పుడు పెట్రోల్‌ లీటర్‌కు రూ.81గా ఉండేదని కుంతియా పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం క్రూడాయిల్‌ ధర బ్యారెల్‌ 75–85 డాలర్ల మధ్యే ఉన్నా లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 81కి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement