సాక్షి, హైదరాబాద్: రాజకీయ నిరుద్యోగుల కోసమే జేఏసీ చైర్మన్ కోదండరామ్ కొత్త పార్టీ పెడతానంటున్నారని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. కోదండరామ్ పార్టీ పెడతాననడం పెద్ద జోక్ అని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం కోదండరామ్ జేఏసీలో ఎవరూ లేరని, టీజీవో, టీఎన్జీవో, ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వంతో కలసి ఉన్నారన్నారు.
కోదండరామ్ వలలో విద్యార్థులు పడొద్దని సూచించారు. తెలంగాణ ఉద్యమకారులపై ప్రేమ ఉంటే కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా విడిగా పోటీ చేయాలని, లేదంటే కాంగ్రెస్‌తో అంటకాగినట్టేనని భావించాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ ఇచ్చే ప్యాకేజీ కోసమే రాజకీయ పార్టీ పెడతానంటూ పాట పాడుతున్నారని ఆరోపించారు. ఉద్యమంలో కలసి పనిచేయని కోదండరామ్, గద్దర్, మందకృష్ణలు ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. కోదండరామ్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ అని, ఆయన పార్టీ పెట్టడం అంటే బంగారు తెలంగాణకు వ్యతిరేకమేనని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment