ఎమ్మెల్యే రేగాకు సీఎం కార్యాలయం నుంచి పిలుపు! | Pinapaka MLA Rega Kantha Rao in Whip Race! | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే రేగాకు సీఎం కార్యాలయం నుంచి పిలుపు!

Published Sat, Sep 7 2019 11:00 AM | Last Updated on Sat, Sep 7 2019 11:11 AM

Pinapaka MLA Rega Kantha Rao in Whip Race!  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు శనివారం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో ఆయన హుటాహుటీన హైదరాబాద్‌ బయల్దేరారు. మంత్రివర్గ విస్తరణకు ఇంకా జాప్యం జరిగే అవకాశం నేపథ్యంలో ఎమ్మెల్యే కాంతారావును ప్రభుత్వ విప్‌గా నియమించే అవకాశం ఉంది. అలాగే  ప్రభుత్వ విప్‌గా క్యాబినెట్‌ హోదాలో నియమించనున్నట్లు తెలుస్తోంది.

కాగా రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతుండగా.. శాసనసభ కమిటీల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. శాసన మండలి, శాసనసభ చీఫ్‌ విప్‌ పదవుల భర్తీపై సీఎం కేసీఆర్‌ దృష్టి సారించారు. ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాలు ముగిసేలోగా శాసనసభ కమిటీల వివరాలతోపాటు, చీఫ్‌ విప్, విప్‌ల పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ శాసనసభ ఏర్పాటై ఎనిమిది నెలలు దాటినా.. బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ మినహా ఇతర కమిటీల నియామకం జరగలేదు. శాసనసభ నిబంధనల ప్రకారం ఆర్థిక, సంక్షేమ, ఇతర రంగాలకు సంబంధించి 19 రకాలైన కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా పబ్లిక్‌ అకౌంట్స్, అంచనాలు, పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌ కమిటీలున్నాయి. సంక్షేమ, ఇతర రంగాల కమిటీలను స్పీకర్‌ నామినేట్‌ చేస్తారు. 

ఎంఐఎంకు పీఏసీ చైర్మన్‌ పదవి
పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీలో మొత్తం 13 మంది సభ్యులకుగాను తొమ్మిది మంది శాసనసభ, నలుగురు శాసన మండలి నుంచి ఎన్నిక అవుతారు. అయితే పీఏసీ చైర్మన్‌ పదవిని ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు ఇవ్వడం ఆనవాయితీ. 119 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో అధికార టీఆర్‌ఎస్‌కు 103 మంది సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్‌ తరఫున 19 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికైనా, 12 మంది చీలిక వర్గం ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్షం హోదాను కోల్పోయింది. ఏడుగురు సభ్యులున్న ఏఐఎంఐఎం అసెంబ్లీలో అతిపెద్ద రెండో పార్టీగా అవతరించింది. ఎంఐఎంకు అధికారికంగా ప్రతిపక్ష హోదా దక్కక పోయినా.. ఆ పార్టీ ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్‌ పదవి దక్కే అవకాశం ఉంది. 

మండలి చీఫ్‌ విప్‌గా పల్లా రాజేశ్వర్‌రెడ్డి? 
గంగుల కమలాకర్, వినయభాస్కర్, గంప గోవర్దన్, బాజిరెడ్డి గోవర్దన్‌ల పేర్లు చీఫ్‌ విప్‌ పదవి కోసం వినిపిస్తున్నాయి. వీరితోపాటు ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, హనుమంతు షిండే, పద్మా దేవేందర్‌రెడ్డి, రేఖా నాయక్, బాల్క సుమన్‌ కూడా రేసులో ఉన్నట్లు సమాచారం. మండలి విప్‌గా ఉన్న డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని చీఫ్‌ విప్‌గా నియమించి, మరో ఎమ్మెల్సీకి విప్‌గా అవకాశం ఇవ్వాలనే యోచనలో సీఎం ఉన్నట్లు సమాచారం. మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్న ఎమ్మెల్యేలతో పాటు, సామాజిక వర్గాల సమతుల్యత పాటిస్తూ చీఫ్‌ విప్, విప్‌ల నియామకంపై కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

చీఫ్‌ విప్, విప్‌ పదవుల కోసం పోటీ 
గత అసెంబ్లీలో చీఫ్‌ విప్‌గా వ్యవహరించిన కొప్పుల ఈశ్వర్‌ ప్రస్తుతం సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు. గత శాసనసభలో గంప గోవర్దన్‌ (కామారెడ్డి), గొంగిడి సునీత (ఆలేరు), నల్లాల ఓదెలు (చెన్నూరు) విప్‌లుగా వ్యవహరించారు. ఓదెలు మినహా మిగతా ఇద్దరూ మరోమారు శాసనసభకు ఎన్నికయ్యారు. కాగా శాసన మండలిలో చీఫ్‌ విప్‌గా వ్యవహరించిన పాతూరు సుధాకర్‌రెడ్డి పదవీ కాలం ఈ ఏడాది మార్చితో ముగిసింది. 2016 ఆగస్టులో మండలి విప్‌లుగా నియమితులైన బోడకుంటి వెంకటేశ్వర్లు, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి నేటికీ కొనసాగుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement