
భారత ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫొటో)
కటక్ : ‘ఈ నేల నాకెంతో ప్రత్యేకం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి ఎందరో మహానుభావులు జన్మించిన పవిత్ర స్థలం కటక్‌లో ఎన్డీయే ప్రభుత్వ నాలుగో వార్షికోత్సవాన్ని జరుపుకోవడం నాకెంతో గర్వకారణంగా ఉంది’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు నాలుగేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా కటక్‌లో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు. ‘ఈ నాలుగేళ్ల పాలన.. 125 కోట్ల మంది భారతీయులకు దేశం అభివృద్ధి దిశగా దూసుకుపోతోందనే నమ్మకాన్ని ఇచ్చిందన్నారు. గత అరాచక ప్రభుత్వం నుంచి విముక్తి కలిగించి సుపరిపాలన అందిస్తున్నామంటూ’ మోదీ వ్యాఖ్యానించారు.
దేశాన్ని పురోగమనంలో నడిపించేందుకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి తమ ప్రభుత్వం వెనుకాడబోదని మోదీ పేర్కొన్నారు. పేద ప్రజలకు బ్యాంకు అకౌంట్ ఖాతా తెరవడం, జీఎస్టీ ద్వారా ఆర్థిక సంస్కరణలకు నాంది పలకడం, బలమైన విదేశాంగ విధానాన్ని ప్రవేశపెట్టడం వంటి అంశాలు దేశ భవిష్యత్తు పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తున్నాయన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించడం ద్వారా శత్రుదేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశామని మోదీ వ్యాఖ్యానించారు. కాగా 2014 ఎన్నికల్లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బీజేపీ.. ఒడిశాలో కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాలని శాయశక్తులా ప్రయత్నించింది. కానీ నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీని ఎదుర్కోలేక కేవలం పది స్థానాలకే పరిమితమైంది.
Comments
Please login to add a commentAdd a comment