మోదీని సన్మానిస్తున్న బీజేపీ నాయకులు. గందరగోళం సమయంలో బారికేడ్లు దూకేందుకు ప్రయత్నిస్తున్న కార్యకర్తలు
దుర్గాపూర్/ఠాకూర్‌నగర్: రాబోయే లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని మోదీ ప్రచారం ప్రారంభించారు. బీజేపీ కార్యకర్తల హత్యాకాండకు పాల్పడుతున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజల ఆశల్ని చిదిమేస్తోందని ఆరోపించారు. బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటంతో సీఎం మమతా బెనర్జీకి గుబులు మొదలైందని అన్నారు. ఆమె పాదాల కింద నేల క్రమంగా కదిలిపోతోందని చురకలంటించారు.
దుర్గాపూర్, ఠాకూర్‌పూర్‌లలో శనివారం జరిగిన రెండు వేర్వేరు కార్యక్రమాల్లో మమతా ప్రభుత్వంపై మోదీ నిప్పులు చెరిగారు. తృణమూల్ కాంగ్రెస్ అంటే తృణమూల్ తోలాబ్జి టాక్స్(ట్రిపుల్ టీ)గా నిలిచి పోయిందని ఎద్దేవా చేశారు. బెంగాలీలో తోలాబ్జి అంటే వ్యవస్థీకృత బలవంతపు వసూళ్లు అని అర్థం. ఇతర దేశాల్లో మతపర వేధింపులు ఎదుర్కొని మన దేశంలో శరణు కోరేవారికి న్యాయం, గౌరవం కల్పించాలంటే పౌరసత్వ బిల్లుకు చట్టరూపం తేవాల్సిందేనని పునరుద్ఘాటించారు.
కమ్యూనిస్టుల బాటలోనే మమత..
ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కేందుకు మమత గతంలో పాలించిన కమ్యూనిస్టుల బాటలోనే నడుస్తున్నారని దుర్గాపూర్‌లో జరిగిన ర్యాలీలో మోదీ విమర్శించారు. బెంగాల్‌లో రూ.90 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇచ్చిందని, వాటిని అమలుచేయాలనే ఆసక్తి తృణమూల్ సర్కార్‌కు కొరవడిందని, వారు ఆ పనుల్లో వాటా కోరుకుంటున్నారన్నారు. బెంగాల్‌కు వలసొచ్చిన మతువా అనే ఎస్సీ వర్గం ఠాకూర్‌పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ..పౌరసత్వ బిల్లుకు చట్టరూపం కల్పించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. తూర్పు పాకిస్తాన్‌కు చెందిన మతువాలు 1950లలో బెంగాల్‌కు వలసొచ్చారు.
సుమారు 30 లక్షల జనాభా ఉండే ఈ వర్గం కనీసం ఐదు లోక్‌సభ స్థానాల్లో ప్రభావం చూపగలదు. అయితే, వారిలో ఇంకా చాలా మందికి భారత పౌరసత్వం దక్కలేదు. ఈ నేపథ్యంలో మతువాలను బీజేపీకి ఓటుబ్యాంకుగా మలిచేలా మోదీ పౌరసత్వ బిల్లుకు మద్దతుగా ప్రసంగించారు. ఠాకూర్‌నగర్ సభకు ప్రజలు పెద్దసంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగినంత పనైంది. ఈ ఘటనలో పలువురు మహిళలు, పిల్లలు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మద్దతుదారులు బారికేడ్లు బద్దలుకొట్టి మరింత లోనికి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించడంతో కొంత గందరగోళం నెలకొంది. ఉన్న చోటే ఉండాలని, ముందుకు రావొద్దని మోదీ వారించినా కొందరు కార్యకర్తలు కుర్చీలు విసిరేస్తూ నానా హైరానా సృష్టించారు.
బెంగాల్‌లో బల ప్రదర్శన!
పోటాపోటీ ర్యాలీలకు తృణమూల్, బీజేపీ రెడీ
మమతా బెనర్జీ గత నెలలో బీజేపీయేతర పార్టీలతో భారీ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. దానికి పోటీగా రాష్ట్ర వ్యాప్తంగా మోదీ, అమిత్‌షాలతో బహిరంగ సభలు నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు తమ అగ్ర నాయకులతో ర్యాలీలు నిర్వహించాలని కమలనాథులు ప్రణాళికలు రచించారు. అయితే ఈ ప్రయత్నాల్ని అడ్డుకోవడానికి తృణమూల్ తన వంతు ప్రయత్నాల్ని చేస్తోంది. ఒకవైపు మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా వివిధ పార్టీలను కూడగడుతున్న మమతా బెనర్జీ ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. బీజేపీ ప్రతిపాదించిన ర్యాలీలు, సభలకు అనుమతులను నిరాకరిస్తున్నారు.
బీజేపీ సభలకు తృణమూల్ అడ్డుపుల్లలు..
విపక్షాల మహాగట్‌బంధన్ ర్యాలీకి ఏమాత్రం తీసిపోకుండా బెంగాల్ వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల నాటికి రాష్ట్రంలోని 32 లోక్‌సభ నియోజకవర్గాల్లో 300 ర్యాలీలు చేపట్టాలని ప్రణాళికలు వేసింది. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి హేమాహేమీలు ఈ ర్యాలీల్లో పాల్గొంటారు. జనవరి 23న జర్‌గ్రామ్, సురి ర్యాలీల్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొనాల్సి ఉండగా, ఆమె హెలికాప్టర్ ప్రభుత్వ హెలిప్యాడ్‌లో దిగేందుకు అనుమతించడంలో జాప్యం జరిగింది. దీంతో స్మతి పర్యటన రద్దయింది. ఈస్ట్ మిడ్నపూర్‌లోని కాంతి దగ్గర బీజేపీ మద్దతుదారుడి పొలంలో అమిత్‌షా ర్యాలీకి ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం పక్కనున్న భూస్వాములతో ర్యాలీకి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేయించింది. ‘బెంగాల్ నుంచి తృణమూల్‌ను తరిమికొట్టడానికి అనుక్షణం పోరాడతా. నా హెలికాప్టర్ దిగేందుకు ప్రభుత్వం అనుమతించకపోతే హెలికాప్టర్ నుంచే ప్రసంగిస్తా. మా రథయాత్రను అడ్డుకుంటే కాలినడకనే ఊరేగుతాం’అని అమిత్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment