వైఎస్సార్‌సీపీలోకి వలసల వెల్లువ | Pocha Brahmananda Reddy and Mannem Madhu and Few Joins In YSR Congress Party | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి వలసల వెల్లువ

Published Sat, Mar 9 2019 4:46 AM | Last Updated on Sun, Mar 10 2019 8:55 PM

Pocha Brahmananda Reddy and Mannem Madhu and Few Joins In YSR Congress Party  - Sakshi

శుక్రవారం పార్టీలోచేరిన మాజీ ఎమ్మెల్యేలు చల్లా రామకృష్ణారెడ్డి, బాలవర్థన్‌రావులను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న జగన్‌

సాక్షి, హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ఇవాళో రేపో వెలువడుతుం దనుకుంటున్న తరుణంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసల వెల్లువ మరింత ఊపందుకుంది. గన్నవరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకట బాలవర్ధనరావు (ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జైరమేష్‌ సోదరుడు), కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్‌ రాజకీయవేత్త చల్లా రామకృష్ణారెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంఎంఆర్‌ గ్రూపు సంస్థల చైర్మన్‌ మన్నెం మధుసూదనరావు, నంద్యాలకు చెందిన పారిశ్రామికవేత్త పోచా బ్రహ్మానందరెడ్డితో సహా పలువురు సినీ కళాకారులు శుక్రవారం పార్టీలో చేరారు. ఈ చేరికలతో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ నివాసం, పార్టీ కార్యాలయం సందడిగా మారింది. వీరంతా వేర్వేరు సమయాల్లో జగన్‌ను ఆయన నివాసంలో కలుసుకుని పార్టీలో చేరాలన్న తమ అభీష్టాన్ని వెల్లడించగా ఆయన వారికి కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. 

పార్టీలో చేరడానికి ఎలాంటి షరతులూ లేవు: బాలవర్థన్‌రావు
తాను పార్టీలో చేరడానికి ఎలాంటి షరతులూ లేవని, జగన్‌ను తాను ఎలాంటి హామీలు అడగలేదని కృష్ణా జిల్లా విజయ డెయిరీ డైరెక్టర్, మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకట బాలవర్థన్‌రావు అన్నారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలో భయానక వాతావరణం నెలకొందనీ, అలాంటి వాతావరణాన్ని తొలగించడానికే తాను వైఎస్సార్‌ సీపీలో చేరానన్నారు. ఎందరో నీతివంతులు గన్నవరం నుంచి ప్రాతినిధ్యం వహించారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో  పార్టీ గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తానని  అన్నారు. 

జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం:మన్నెం
వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడమే తన లక్ష్యమని మన్నెం మధుసూదనరావు అన్నారు. సాధారణ దళిత కుటుంబం నుంచి వచ్చి ఇవాళ పారిశ్రామికవేత్తగా ఎదిగానని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఎంఎంఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. దళితులతో పాటు అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి జగన్‌ ద్వారానే సాధ్యమన్నారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.  

జగన్‌పై ప్రజల్లో నమ్మకం, విశ్వసనీయత ఉంది: చల్లా
నమ్మకం, విశ్వసనీయత కలిగిన జగన్‌ను ప్రజలు కోరుకుంటున్నారని, చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేరలేదని చల్లా రామకృష్ణారెడ్డి అన్నారు. కడపలో నిర్మించాలనుకుంటున్న  స్టీల్‌ ప్లాంట్‌ కేంద్ర సహకారం లేకుండా సాధ్యమా అని ప్రశ్నించారు. ఎన్నిసార్లు చంద్రబాబు ద్వారా ప్రజలు మోసపోవాలని నిలదీశారు. నియోజకవర్గంలో తనకు అప్పగించిన బాధ్యతలు నెరవేరుస్తానని చెప్పారు. ఎన్టీ రామారావు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసిన తాను టీడీపీలో ఒడిదుడుకులు భరించలేక వైఎస్సార్‌ సీపీలో చేరానన్నారు. పాణ్యం, బనగానపల్లె నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించి తెస్తానని ఆయన ధీమాగా చెప్పారు.

చంద్రబాబు పాలన అవినీతి మయం: బ్రహ్మానందరెడ్డి 
 చంద్రబాబు పాలన మొత్తం అవినీతి మయమై పోయిందని, ప్రజలు ఆయన పాలనపై విసిగి వేసారి ఉన్నారని, ఈ దఫా కర్నూలు జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు భారీ మెజారిటీ వస్తుందని అన్నారు. శిల్పా మోహన్‌రెడ్డి సోదరుల విజయానికి కృషి చేస్తానన్నారు. ప్రజలు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని విశ్వసిస్తున్నారని, మహానేత వైఎస్సార్‌ లాగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జనరంజకంగా పాలన సాగిస్తారని అన్నారు.ప్రజలకు చేరువగా ఉండి, పార్టీలో క్రమశిక్షణగా పనిచేస్తానన్నారు. చంద్రబాబు   ప్రజల అగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

పార్టీలో చేరికల సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్, బి.వై.రామయ్య, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, బ్రిజేంద్రారెడ్డి, కాటసాని సోదరులు రాంభూపాల్, రామిరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

సజ్జల సమక్షంలో పార్టీలోకి సినీ కళాకారులు 
సినీనటుడు, పార్టీ కార్యదర్శి పృథ్వీరాజ్, కృష్ణుడు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో సినీ కళాకారులు పార్టీలో చేరారు. పార్టీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో వారంతా పార్టీలో చేరారు. కళాకారులు జయశ్రీ, పద్మరేఖ, ఆశ, ప్రిద్విక, మీనాక్షి, తేజస్విని, జోగినాయుడు, మదుసుధ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. బడుగు వర్గాల సంక్షేమం కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన పథకాలకు ఆకర్షితులమై పార్టీలో చేరామని వారన్నారు. 

వీధి నాటకాల ద్వారా టీడీపీ అరాచకాలపై ప్రచారం:పృథ్వీరాజ్‌
వీధి నాటకాల ద్వారా టీడీపీ అరాచాకాలు ప్రజలకు తెలియజేస్తామని పృథ్వీరాజ్‌  అన్నారు. చంద్రబాబుకు దోచుకోవటానికి ఏమి లేక ఓట్లు కూడా దోచుకొంటున్నారని చెప్పారు. ప్రజలు ఇక చంద్రబాబును నమ్మే స్థితిలో లేరన్నారు. పెదబాబు, చినబాబులకు రాబోయే రోజులు గడ్డుకాలమేనని చెప్పారు. టీడీపీపైన ప్రజల్లో ఎప్పుడూ లేనంతా  వ్యతిరేకత వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరికీ  చంద్రబాబు అరాచకాలు తెలిసేలా వాడ వాడలా  కళా ప్రదర్శనలిస్తామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement