కంచరపాలెం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు
మొగుడ్ని కొట్టి.. మొగశాలకెక్కిన చందంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోంది.పౌరుల డేటా చోరీకి పాల్పడి గంపగుత్తగా ఆన్‌లైన్‌లో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు ఆ పార్టీ నేతల పేర్లతోనే దరఖాస్తులు నమోదు చేయడానికి తెగించిన టీడీపీ నేతలు.. ఆ వ్యవహారం కాస్త రచ్చ రచ్చ అయ్యి.. తమ బండారం బయటపడటంతో మరింత దిగజారుడుతనంతో వ్యవహరిస్తున్నారు.
తమ ఓట్లనే తొలగిస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపైనే ఎదురు కేసులు పెడుతున్నారు.అధికార పార్టీకి వీరభక్తులుగా మారిపోయిన పోలీసులు.. ఫిర్యాదు అందడమే ఆలస్యం ఎన్నడూ లేనంత వేగంగా స్పందిస్తున్నారు. తమకు అందిన ఫిర్యాదుల్లో వాస్తవమెంతో కనీసం ప్రాథమికంగానైనా నిర్ధారించుకోకుండానే వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై ఎడాపెడా కేసులు బనాయించేస్తున్నారు. అదే సమయంలో తమ పార్టీ వారి ఓట్లు తొలగిస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ఇస్తున్న ఫిర్యాదులపై మాత్రం నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నారు.
కేసుల సంగతి ఇలా ఉంటే.. ఓట్ల తొలగింపుపై గత కొద్దిరోజులుగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో అబ్బే.. ఫారం–7 దరఖాస్తులు వచ్చినంత మాత్రాన.. తమ ప్రమేయం, పరిశీలన లేకుండా ఎటువంటి తొలగింపులు ఉండవని గంభీరమైన ప్రకటనలు చేసిన అధికారులు.. ఆచరణలో దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.
గత 20 రోజుల్లో అందిన 75,747 ఫారం–7 దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపామంటూ మూడోవంతు... అంటే 25,635 ఓట్లపై వేటు వేసేశారు. మరో 14,830 తొలగింపు దరఖాస్తులు విచారణ దశలో ఉన్నాయని అంటున్నారు. అంటే రేపో మాపో అవి కూడా పోయే ప్రమాదముందన్న మాట. ఈ పరిణామాలతో ఆందోళనకు గురవుతున్న వైఎస్సార్‌సీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
సాక్షి, విశాఖపట్నం: అధికార పార్టీ నేతల చేతుల్లో అధికారులు సైతం తోలుబొమ్మల్లా మారినట్టు కన్పిస్తోంది. వారి ఆడిందే ఆట.. పాడిందే పాటగా అడుగులు వేస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు ఫిర్యాదులివ్వడమే తరువాయి క్షణాల్లో యాక్షన్‌లోకి దిగి పోతున్నారు. ఎన్నికల ముంగిట అధికార పార్టీ నేతలు ఆడుతున్న ఓట్ల దొంగాటలో అధికారులు పావులుగా మారుతున్నారు. ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ శ్రేణులపైనే తిరిగి కేసులు నమోదు చేస్తూ కక్ష సాధింపు చర్యలకు ఒడిగడు తున్నారు.
దొంగ ఓట్లు నమోదవుతున్నాయ్.ఉన్న ఓట్లుతొలగించేస్తున్నారు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆందోళన చేస్తున్నారు. జాతీయ ఎన్నికల కమిషన్ నుంచి మండల తహసీల్దార్ వరకు ఫిర్యాదులు చేశారు. వాటి జోలికి పోనీ అధికారులు అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతో వారిచ్చిన ఫిర్యాదులపై ఆఘమేఘాల మీద చర్యలకు ఉపక్రమిస్తున్నారు. వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ సభ్యులు, శ్రేణులను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే ఆరిలోవ, కంచరపాలెం, నర్సీపట్నం పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లో 27 మంది, ఆరిలోవ పోలీస్ స్టేషన్‌లో 53 మంది, నర్సీపట్నం పోలీస్‌స్టేషన్‌లో 24 మందిపైన కేసులు నమోదు చేశారు. ఈ అరెస్ట్‌లను నిరసిస్తూ విశాఖ తూర్పు నియోజకవర్గ కో ఆర్డినేటర్ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆరిలోవ పోలీస్‌స్టేషన్ ఎదుట పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళనకు దిగారు. మిగిలిన పోలీస్‌స్టేషన్లలో టీడీపీ నేతల ఒత్తిళ్ల మేరకు వైఎస్సార్‌సీపీ శ్రేణులపైనే కేసులు నమోదు చేస్తున్నట్టు తెలు స్తోంది. మరో వైపు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపైనే అధికారులు దృష్టి కేంద్రీకరించడం విమర్శలకు తావిస్తోంది.
మరో వైపు వచ్చిన ఫిర్యాదులపై క్షేత్ర స్థాయి పరిశీలన పేరుతో ఓట్ల తొలగింపులకు అధికారులు శ్రీకారం చుట్టారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల ముంగిట కేవలం 20 రోజుల వ్యవధిలోనే 75,747 దరఖాస్తులందాయి. పైకి ఒక్క ఓటు కూడా తొలగించలేదంటూనే ఇప్పటి వరకు క్షేత్రస్థాయి పరిశీలన పేరిట 25,635 ఓట్లను అధికారికంగా తొలగించారు. మరో 14,830 ఓట్ల తొలగింపులకు చెందిన క్‌లైమ్‌లు అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఓట్లతొలగింపు దరఖాస్తులకు దీటుగానే కొత్త ఓట్ల నమోదు కోసం కూడా దరఖాస్తులు వెల్లువెత్తాయి. కేవలం 20 రోజుల వ్యవధిలోనే 2,22,557 దరఖాస్తులందాయి. వీటిలో ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం 1,65,705 మందికి కొత్తగా ఓటు హక్కు కల్పించారు. మరో 36,357 మందికి ఓటు హక్కుకల్పించేందుకు అర్హులుగా నిర్ధారించినప్పటికీ ఆ క్‌లైమ్‌లు సంబంధిత ఆర్వోల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలిన వాటికి సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన జరపాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
పరిస్థితి ఇలా..
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చేనాటికి విశాఖ జిల్లాలో 34,21,822 మంది ఓటర్లుండేవారు.–అలాంటిది 2019 జనవరిలో ప్రకటించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలోని ఓటర్ల సంఖ్య 32,80,028లకు చేరింది. –2014–18 మధ్యలో ఏకంగా 2,72,480 ఓట్లు తొలగించారు. 2018 సెప్టెంబర్ నుంచి 2019 జనవరి మధ్యలో ఏకంగా 1,64, 579 ఓట్లు కొత్తగా చేర్చగా, కేవలం 43,893 ఓట్లను మాత్రమే తొలగించారు. కాగా రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణ గడువు వరకు చేర్పులు, మార్పులకు దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉండడంతో దరఖాస్తుల వెల్లువ కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. దొంగ ఓట్ల నమోదు, ఉన్న ఓట్ల తొలగింపులు పెద్ద ఎత్తున జరిగే ఆస్కారం కన్పిస్తోంది.
ఇప్పటికే నగరంలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలకు చెందిన వివిధ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులతో పెద్ద ఎత్తున కొత్త ఓట్ల నమోదుకు దరఖాస్తులు చేయించినట్టుగా తెలుస్తోంది. గీతం యూనివర్సిటీ, నారాయణ, శ్రీచైతన్య, ఆళ్వార్‌దాస్ తదితర విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు పెద్ద ఎత్తున ఓటు హక్కు కల్పిస్తున్నారు. వీరికి తమ స్వస్థలాలతో పాటు ఇక్కడ కూడా ఓటు హక్కు కల్పించడం ద్వారా రేపటి ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించేందుకు అధికార పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. వీటిని అడ్డుకోవల్సిన అధికారులు అధికార పార్టీ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కేసులు నమోదు చేయడం విమర్శలకు తావిస్తోంది. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరుపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్ సీపీ నేతలు సన్నద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment