సాక్షి, మచిలీపట్నం: సార్వత్రిక సంగ్రామానికి సమయం ఆసన్నమైంది. దాదాపుగా అభ్యర్థిత్వాలపై ఓ స్పష్టత రావడంతో ఇక రంగంలోకి దిగడమే మిగిలింది. అభ్యర్థులు నామినేషన్, ప్రచారాలకు శుభఘడియలు, కలిసొచ్చే రోజు కోసం ఆరాటపడుతున్నారు. తెలిసిన వారిని వెంటబెట్టుకొని పేరు, జన్మనక్షత్రం ఆధారంగా నామినేషన్ సమయం నిర్ణయించేందుకు తెలిసిన అన్ని ప్రాంతాల్లోని జ్యోతిష్యుల వద్దకు క్యూ కడుతున్నారు. మరికొందరు అనుచరులను పురమాయిస్తున్నారు. అనేక నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఆ రోజు నుంచి 25వ వరకు నామినేషన్ వేసుకునే అవ కాశం ఉంది. 26న పరిశీలన, 28 నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు.
పురోహితులకు డిమాండ్
ఎన్నికల వేళ పురోహితులకు డిమాండ్ పెరిగింది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని కార్యకర్తలను అభ్యర్థులు ఆదేశిస్తున్నారు. తమ పేరుతో పూజా టిక్కెట్ల బుకింగ్, పురోహితుల సమయాన్నీ రిజర్వు చేసుకుంటున్నారు. ప్రధానంగా 18–25 తేదీల మధ్య మంచి రోజులపై ఆసక్తి ఏర్పడింది. 25వ తేదీ నుంచి మంచిరోజులు ఉండటంతో ఆ రోజుల్లో నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రచారానికి మంచి రోజు నిర్ణయించుకుంటున్నారు. తమ సెంటిమెంట్ ఆలయాల నుంచి ప్రచారం ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా శుభఘడియల కోసం పడుతున్న పాట్లు ఆసక్తికరంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment