
సుశీలక్కా.. ఓ సుశీలక్కా.. ఇంకా రడీ కాలేదేంటే.. అంటూ వచ్చింది వనజాక్షి
సుశీల : ఆ.. ఇంట్లో పాచి పనులన్నా అవ్వొద్దంటే వనజ.. అన్ని పనులూ నేనే చూసుకోవాల. ఇదిగో ఉక్కరవసేపు ఉండవే వత్తన్నా..
వనజ : ఇయ్యాల ఆదివారం కదా .. మరి పిల్లలను ఏం సేత్తన్నవ్..
సుశీల : పిల్లోల్లు కూడా మనెంటే తీసుకెళదాం.. ఆళ్లే తిరగతారు..
వనజ : అమ్మో.. బైట అగ్గి చూడక్కా.. ఎట్టుందో.. మనమే మాడిపోతన్నం.. పిల్లలు తట్టుకోలేరు.. వద్దులే అక్క..
సుశీల : మరి ఏం సెయ్యాలే.. ఆదివారమైనా ఆయన రిచ్చా తొక్కితేనే కదా.. నాలుగు డబ్బులొచ్చేది.. ఇంటి దగ్గర వోరుంటారే..
ఇంతలో ఆ వీధిలో నాలుగు అక్షరం ముక్కలు చదువుకున్న పద్మ అక్కడికి వచ్చింది.
పద్మ : ఏంటి అక్కాచెల్లెళ్లు ముచ్చట్ల మీదున్నారు..
వనజ : అవునక్కా.. ఇయ్యాల .. మన ముక్కమంత్రి కొడుకు లోకేశంబాబు ప్రచారమంట.. పిలిత్తే ఎలతనం..ఒక్కోరికి ఐదొంతలు నుంచి ఎయ్యిదాకా ఇత్తన్నారులే..
సుశీల : అవునమ్మా.. ఆదివారం కదా.. ఏవో నాలుగు డబ్బులొత్తాయని మేమూ వత్తామని సెప్పాం.. మన ఈది సివర తెలుగుదేశం ఆయన ఈ పని కుదిర్చాడు.
పద్మ : అవునా.. సరేలే వనజ వెళ్లండి.. మరి పిల్లల సంగతేంటి ?
సుశీల : అదే అక్క.. మా ఎంట తీసకెళదామనుకుంటున్నాం..
పద్మ : అమ్మో.. ఆ లోకేశంబాబు మీటింగ్‌లకు పిల్లలను తీసుకెళ్లొద్దమ్మా.. వాళ్లకు వచ్చే నాలుగు అక్షరాలు కూడాపోతాయి. కావాలంటే పిల్లల దగ్గర నేనుంటా.. మీరే వెళ్లిరండి.
సుశీల : అదేంటక్కా.. అలా అంటవ్.. ఆయన ముక్కమంత్రి కొడుకు కదా.. ఆయన మాట్టాడితే.. ఏమైతదక్కా..
పద్మ : ఒక్కసారి ఆయన నోటి నుంచి వచ్చిన ఆణిముత్యాల గురించి చెబుతా వినవే..మంగళగిరిలో ప్రచారం మొదలు పెట్టిన దగ్గర నుంచి లోకేశం బాబు నాలుక మడతపడని రోజు లేదు. తెలుగుకు తెగులు పుట్టించని రోజు లేదు.వచ్చిన రోజునే మంగళగిరిని మందలగిరిగా మార్చేశాడు. గుంటూరును గుంత్రు అనేశాడు.
వనజ : అవునా.. మన పిల్లొల్లు కూడా సక్కగా అంటరు కదక్కా.. ఆయనకేమైనా నాలిక మందమా!
పద్మ : అదేమో తెలియదే.. లోకేశం బాబు ప్రచారం మాత్రం మంగళగిరి ప్రజలకు మంచి కామెడీ షోలా అనిపిస్తుంది. సగం మంది జనం ఆయన చెప్పే మాటలు విని నవ్వుకోవడానికే వెళుతున్నారంట.
సుశీల : ఆయన ఈ ఒక్క మాట సెబితే ఏమైతదిలే అక్కా!
పద్మ : అమ్మో.. ఆ ఒక్కటి ఏంటే ఆయన మాట్లాడే ప్రతి మాటా.. ఆణిముత్యమేనని సోషల్ మీడియాలో తెగ జోకులు వేసుకుంటున్నారు..ఇదిగో మంగళగిరి వచ్చిన రెండో రోజే.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నాన్న ‘వైఎస్ వివేకానంద రెడ్డి మృతితో పరవశించాన’ని బహిరంగంగా చెప్పాడు. మరి అది కావాలని అన్నాడో. మనసులో ఉన్నది అన్నాడో.. ఇదీ నాలుక మడతో అర్థం కాలేదే.. కానీ పక్కన ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆయన వాహనం వెంట ఉన్న వాళ్లు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు..
వనజ : పోనీలే అక్క అదేదో.. అనుంటాడులే.. పద్దాక.. రాజికీయాలే మాట్టాడతారు కదా.. అందుకే అట్ట వచ్చుంటదిలే..
పద్మ: అదొక్కటి కాదే.. ఇంకా ఉన్నాయి.. లోకేశం బాబు గురించి..ఆ మాటలు వింటున్న మంగళగిరి ప్రజలు.. ఈయనకు మంగళగిరి మాలోకం అని పేరు పెట్టేశారే..
సుశీల : అవునా అక్కా.. పాపం అదేందే..
పద్మ: అవును మరి.. రెండు రోజుల క్రితం మంగళగిరిలో మాట్లాడుతూ ఏప్రిల్ 9వ తేదీన తనకు ఓట్లేసి గెలిపించాలని చెప్పారు.. మళ్లీ జనం ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
సుశీల : అదేంటక్కా.. ఎలచ్చన్లు వచ్చే నెల 11న అంటన్నారుగా..!
పద్మ : అవునే ఎలక్షన్స్ ఏప్రిల్ 11వ తేదీనే.. ఏం చదువుకోని నీకే ఈ విషయం గుర్తుంటే.. రాష్ట్రానికి మంత్రిగా పని చేశాడు. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తన్నాడు. పైగా ముఖ్యమంత్రి కొడుకు.. ఆయనకు ఈ మాత్రం తెలియకపోవడం ఏమిటో.. కొంచెం కూడా అర్థమై చావట్లేదు. నిన్నటికి నిన్న తనను ఐదు లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరాడు.. ఇది విన్న ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఓట్లు ఉన్నవే 2.50 లక్షల చిల్లర.
వనజ : మరి ఐదు లచ్చల ఓట్లు ఏడ నుంచి తేవాలక్కా.. అదేందే అట్ట మాట్టాడ్డం..
సుశీల : అయినా ఈ నాయకులంతా ఏదో కాగితంలో ముందుగనే రాసుకుని సదువుతరంటగా.. అట్ట కూడా ఈయన సదవలేదా !
పద్మ : ఎందుకు చదవలేదే.. ఈయనగారి కోసం ముఖ్యమంత్రి గారు.. ఏకంగా తెలుగు క్లాసులే చెప్పించారు.. కానీ లోకేశం బాబుకే వంట బట్టల! 1980 నుంచి మంగళగిరిలో టీడీపీ గెలిచిందే లేదన్నాడు.
వనజ : అవునా.. గెలిచినట్లున్నారుగా అక్కా..
పద్మ : 1980లో తెలుగుదేశం పార్టీనే పెట్టలేదే..కానీ మంగళగిరి మాలోకానికి అదీ తెలియదనుకుంటా. ఇవే కాదే.. గతంలోనూ ఆయన పదే పదే నోరు జారడం.. తరువాత నాలుక కరుచుకోవడం చాలాసార్లు జరిగాయి. అంబేడ్కర్ జయంతి రోజున.. వర్ధంతి అనేశాడు. అవినీతి, అరాచకమైన పార్టీ ఏదైనా ఉందంటే .. అది తెలుగుదేశం పార్టీనే అని సెలవిచ్చాడు.
వనజ : అమ్మో.. అదేందక్కో.. ఆళ్ల పారిటీ గొప్పలు తెగ సెప్పేసుకుంటరుగా.. మరి ఈయనేంది ఇట్టా సెప్పారంటన్నవ్..
పద్మ : అవునే.. చాలా మంది జబర్దస్త్ కామెడీ షో బదులు.. యూట్యూబ్‌లో లోకేశం బాబు వీడియోస్ చూసి నవ్వుకుంటున్నారే.. ఇప్పుడు పిల్లలవి అంతా ఇంగ్లిష్ మీడియం చదువులు.. లోకేశం బాబు సభల దగ్గరకు వెళితే వచ్చే నాలుగు ముక్కల తెలుగు కూడా రాకుండా పోతుంది. అదీగాక జనరల్ నాలెడ్జ్ విషయంలోనూ ఆయన తడబాటుకు వీళ్లకు సవాలక్ష డౌట్లు వస్తాయి.
సుశీల : అమ్మో.. నా పిల్లలను ఆ సభలకాడకి పట్టకెల్లను. నీకాడే ఉంచక్కా.. మద్దానం..ఆళ్ల అయ్య వత్తడులే..
పద్మ : సరే వెళ్లిరండి.. లోకేశం బాబు ప్రసంగం మాత్రం వినకండి..
అక్కాచెల్లెళ్లు సభకు వెళ్లొచ్చాక అదే రోజు సాయంత్రం పద్మ దగ్గరకు వెళ్లారు.
సుశీల : అక్కా.. ఆళ్లెంట తిరగాం.. తలా ఐదొంతలు ఇచ్చారులే.. లోకేశం బాబు అదేందో అన్నాడంటక్కా.. జనం తెగ నవ్వుకుంటన్నరు..ఏదో పోరుటు సంగతంట.!
పద్మ: (ఒక్కసారిగా పగలబడి నవ్వుతూ) అవునే.. ఈ రోజుకు కూడా లోకేష్ బాబు.. మరో జోక్ పేల్చాడు.. ఇదిగో ఈ వీడియో చూడు. మచిలీపట్నం పోర్టును కేసీఆర్ తీసుకెళతాడంట!
వనజ : హైదరబాద్‌లో సముద్రం ఏడదక్కా!
పద్మ : అవును .. లోకేశం బాబు చెప్పే మాటలన్నీ ఇంతే ఉంటాయి.
సుశీల : ఈ మాటంటే నాకోటి గుర్తుకొత్తాంది.. అదేదో సినమాలో సీకాంత్ కూడా.. ఇంతే అంటడు.. హైదరబాద్‌కు సముద్రాన్ని తీసకొత్తనని. అప్పుడు.. ఇదెట్టా కుదిరిద్దబ్బా అనుకున్నం.. లోకేశం బాబు సెబితే.. తెలుత్తుంది. ఆయన తెచ్చే సముద్రంలోకేననుకుంటా కేసీఆర్ సర్ పోరుటు తీసకెల్లేది. ఇది విన్న అక్కాచెల్లెళ్లు ఒక్కసారిగా పకపకా నవ్వుకుంటూ ఇంటి దారి పట్టారు.
Comments
Please login to add a commentAdd a comment