
సంగారెడ్డి క్రైం: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రాజకీయ సంచలనం సృష్టిస్తామని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం అన్నారు. బీఎల్‌ఎఫ్ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని సంగారెడ్డిలో మంగళవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాతా అభివృద్ధిలో వెనుకబడే ఉన్నామన్నారు. ప్రభుత్వాలు మారినా రైతు ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదన్నారు. తెలంగాణ ఏర్పడితే మూతపడిన పరిశ్రమలను తిరిగి తెరిపిస్తామని ప్రగల్బాలు పలికిన కేసీఆర్ ఏ ఒక్క పరిశ్రమను తెరిపించ లేకపోయారన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు.
ప్రతి క్వింటాలుకు రూ.8 వేల నష్టం వాటిళ్లుతోందని, అయినా ఎకరాకు రూ.4 వేలు ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులను ఒక్కటే అడుగుతున్నామని, సామాజిక వర్గానికి సీట్లు ఇస్తాం, మీరు ఇస్తారా అని సవాల్ విసిరారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ నల్లా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 40 వేల ఓట్లు ఉన్న వెలమ సామాజిక వర్గం అధికారం చెలాయిస్తోందని, 80 శాతానికిపైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజ్యాధికారానికి అర్హులు కారా? అని నిలదీశారు. కార్యక్రమంలో నాయకులు చుక్క రాములు, బీఎల్‌ఎఫ్ కన్వీనర్ మజీదుల్లాఖాన్, బీఎల్‌ఎఫ్ రైతు చైర్మన్ వనజ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment