
సాక్షి , చెన్నై: ప్రతిష్టాత్మకంగా మారిన ఆర్ కేనగర్ ఉప ఎన్నికలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికలో ఓటర్లు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. 73.45 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ నెల 24న కౌటింగ్ జరగనుంది. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ జోరుగా సాగింది. ఓటర్లు పెద్దసంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మొత్తం 258 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ సాగింది.
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ నియోజకవర్గం చెన్నై ఆర్కే నగర్. ఆమె మరణంతో ఖాళీ అయిన ఈ నియోజకవర్గానికి ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా.. ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన ఉప ఎన్నికల షెడ్యూలు విడుదలై నామినేషన్లు కూడా పూర్తయ్యాయి. అయితే ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో అప్పట్లో ఈసీ ఉప ఎన్నికను రద్దుచేసింది. ప్రస్తుతం అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీ అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థిగా టీటీవీ దినకరన్ సహా మొత్తం 59 మంది రంగంలో ఉన్నారు. సహజంగా తమిళనాడులో ఏ ఎన్నికలు వచ్చినా ప్రధాన పోటీ అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యనే ఉంటుంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే బహిష్కృతనేత దినకరన్ పోటీకి దిగడంతో త్రిముఖ పోటీ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment