
సాక్షి, హైదరాబాద్: టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తమ పార్టీలోకి వస్తున్నారని అధికారికంగా ఎవరూ చెప్పలేదని, పార్టీకి లాభం చేకూరేలా ఎవరు వచ్చినా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి చెప్పారు. అయితే తమ పార్టీలోకి వచ్చేవారు.. గతంలో పార్టీపై చేసిన విమర్శలకు చింతిస్తున్నామని చెప్పి వస్తే కార్యకర్తలు హర్షిస్తారన్నది తన వ్యక్తిగత అభిప్రాయం అన్నారు.
అసెంబ్లీ మీడియా పాయింట్ హాలులో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. గతంలో రాజీవ్‌గాంధీని ఉరితీయాలని మాట్లాడిన నేతలు కూడా పార్టీలో ఉన్నత పదవులు పొందిన చరిత్ర కాంగ్రెస్‌లో ఉందన్నారు. ఈ నెల 27 నుంచి మొదలు కానున్న అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో సీఎం కేసీఆర్ ఎందుకు రాజీపడుతున్నారని ప్రశ్నించారు. పోలవరం డిజైన్ మార్చాల్సిందేనని డిమాండ్ చేశారు. పత్తి కొనుగోలుపై సర్కార్ దృష్టి సారించాలని పొంగులేటి సూచించారు.