
నాలుగేళ్లయినా ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మించుకోకపోవడం బాధాకరమని కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు.
సాక్షి, న్యూఢిల్లీ: నాలుగేళ్లయినా ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మించుకోకపోవడం బాధాకరమని కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రగతి భవన్‌ను యుద్దప్రాతిపదికన నిర్మించుకున్నారన్నారు. భూమి అందుబాటులో ఉన్న ఏపీ భవన్‌లో కొనసాగడమెందుకని ప్రశ్నించారు. తెలంగాణ భవన్ నిర్మిస్తే విద్యార్థులు, ఉద్యోగులు, సందర్శకులకు ఉపయోగకరమని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రటేరియట్‌కు రారని, ప్రగతిభవన్‌లో అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా ప్రతిపక్షాలను కలవరని మండిపడ్డారు.
తెలంగాణలో మిషన్ భగీరథ నత్తనడకన నడుస్తోందన్నారు. 17 వేల కోట్ల మిగులు బడ్జెట్ మేమిస్తే, లక్షన్నర కోట్ల అప్పు చేశారని విమర్శించారు. దళితులకు భూమి ఇవ్వలేదని, డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఊసే లేదన్నారు. రైతుబంధు పథకాన్ని కౌలు రైతులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో అనేక హామాటు నెరవేరలేదని, అందుకే సుప్రీంకోర్టులో కేసు వేశామన్నారు. కేసీఆర్ రాజ్యాంగ ధర్మాన్ని పాటించాలన్నారు. సోనియాగాంధీ చలువతోనే తెలంగాణ వచ్చిందని పేర్కొన్నారు.