
సాక్షి, హైదరాబాద్: పెట్రోలు, డీజిల్ ధరల పెరగుదలపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మాజీ ఎంపీ పొన్నంప్రభాకర్, సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు మంగళవారం మీడియాతో మాట్లాడారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ రూపాయి విలువ తగ్గడంపై చేసిన వ్యాఖ్యలు అరుంధతి నక్షత్రాన్ని చూపినట్లుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. నోట్ల రద్దుతో ఈ పరిస్థితి వస్తుందని మన్మోహన్ సింగ్ గతంలోనే చెప్పారని గుర్తుచేశారు. నాడు మన్మోహన్ మాటలను తప్పుపట్టిన మోదీ ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో మోదీ కాళ్లు మొక్కుతారు.. ఇక్కడ నిలదీస్తానంటాడని విమర్శించారు. పెరుగుతున్న ద్రవ్యోల్భణం, పెట్రో ధరలపై కేసీఆర్ మోదీని ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. క్రూడాయిల్ బ్యారెల్ ధర తగ్గినా పెట్రో ధరలు ఎందుకు తగ్గడం లేదో మోదీ సమాధానం చెప్పాలన్నారు.
పెట్రోలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలో తేవాలి
పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. పెట్రో, డీజిల్‌లపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను రద్దచేయాలని కోరారు. పెట్రోలు, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సామాన్యుల శాపాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పకుండా తగులుతాయని తెలిపారు. పెరిగిన పెట్రో ధరలను నిరనగా కాంగ్రెస్ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment