కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్ : చర్చల పేరుతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగులను అవమానించిందని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తమ సమస్యల గురించి వివరించడానికి వచ్చిన నేతలు, ఉద్యోగులను ప్రగతిభవన్ బయటే ఆపి అహంకార పూరితంగా వ్యవహరించిందని మండిపడ్డారు. పీఆర్సీ కమిటీ, బదిలీలపై గడువు పెంపు తప్ప ఉద్యోగుల మేలు కోసం సీఎం కేసీఆర్ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం గతంలో ఉన్న ట్రిబ్యునల్‌ను కేసీఆర్ సర్కార్ ఎందుకు రద్దు చేసిందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
ఇచ్చింది మూడు శాతమే...
నాలుగేళ్లుగా కేసీఆర్ సర్కార్ ఉద్యోగుల గురించి పట్టించుకోవడం లేదని పొన్నం విమర్శించారు. రోశయ్య సీఎంగా ఉన్నపుడే ఉద్యోగులకు 39 శాతం ఫిట్‌మెంట్ ఇస్తే.. అంతకంటే కేవలం మూడు శాతం పెంచి గొప్పలు చెప్పుకోవడం తప్ప కొత్తగా చేసిందేమీలేదని ఎద్దేవా చేశారు. అయినా ఈ విషయంలో కేసీఆర్‌ను, కేటీఆర్‌ను అని ఏం లాభం లేదని.. దీనికంతటికీ ఉద్యోగ సంఘం నేతలే పరోక్ష కారణమని ఆరోపించారు.
చెంచాగిరి చేయడం వల్లే..
రిటైర్‌మెంట్ తర్వాత ఉద్యోగ సంఘం నేతలు ఎమ్మెల్యే టికెట్ల కోసమే ప్రభుత్వానికి చెంచాగిరి చేస్తున్నారని పొన్నం ఆరోపించారు. ఎక్కువగా మాట్లాడేవారిని చెప్పుతో కొట్టాలంటూ కేటీఆర్ మాట్లాడినా, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బూతులు తిడుతున్నా వారికి బుద్ధి రావడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు కేసీఆర్ తాబేదార్లుగా మారడం వల్ల ఆంధ్రాలో నాలుగో తరగతి ఉద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారంటూ ఆయన విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment