
సాక్షి, కరీంనగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ నియంతృత్వ విధానాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మా ఇంటి తలుపులు కొట్టి హౌస్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఇంటి ముందు పోలీసులను కూర్చోబెట్టడం దారుణమని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి అణచివేతను ఎదుర్కొనలేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రాజరిక పాలన చేస్తుండడంతో ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కోల్పోయినట్లు వెల్లడించారు. అర్థరాత్రి సమయంలో మా ఇంటి తలుపులు కొట్టి మా కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాను కోరుతున్నట్లు స్పష్టం చేశారు. ఒక ఉద్యమకారుడిగా ప్రభుత్వం చేస్తున్న చర్యలకు సిగ్గుపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ సమస్యను ఒక రాచరిక దృష్టితో చూడకుండా ప్రజాస్వామ్యంగా ఆలోచించి సమస్యను పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు పొన్నం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment