కులం కాదు.. గుణం చూసి ఓటేయండి | Posani Krishna Murali Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

కులం కాదు.. గుణం చూసి ఓటేయండి

Published Thu, Dec 13 2018 4:35 AM | Last Updated on Thu, Dec 13 2018 4:35 AM

Posani Krishna Murali Fires On Chandrababu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో కమ్మవారు ఎక్కువగా ఉన్నారని, వారు ఓటేస్తే టీడీపీ అభ్యర్థి సుహాసిని గెలుస్తుందని చంద్రబాబు భావించారని ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి అన్నారు. కానీ, అక్కడున్న కమ్మవారు చాలా తెలివైనవారని, వారు కృతజ్ఞతగా, నిజాయతీగా, మంచి వ్యక్తులుగా వ్యవహరించారని ప్రశంసించారు. కులాన్ని చూసి కాకుండా మంచితనాన్ని చూడాలనే భావంతో మాధవరం కృష్ణారావుకు ఓటేశారని చెప్పారు. ఇదే విధమైన గొప్ప వివేకాన్ని ప్రదర్శించాలని ఆంధ్రా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. పోసాని బుధవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘చంద్రబాబు మన కులంవాడని ఆయనకు ఓటు వేయొద్దు. ఎవరు నిజాయితీపరులో, ఎవరు మనకు సేవ చేస్తారో, ఎవరు వెన్నుపోటు పొడవరో తెలుసుకుని ఓటు వేయాలి. కులపిచ్చితో మళ్లీ చంద్రబాబుకు ఓటేయాలని చూస్తే మాత్రం ఆంధ్రా కమ్మవారు మిగతా సభ్య సమాజానికి మొత్తం దూరమవుతారని గుర్తుంచుకోవాలి. కమ్మవారిని చంద్రబాబు రోడ్డుమీద పడేశారు. ఇందులో ఆ కులంవారి తప్పులేదు. మన అభిమానాన్ని మనలోనే ఉంచుకుని మీరు నిజాయితీగా ఉంటే వెంటనే జగన్‌పై జరిగిన కత్తి దాడిని (హత్యాయత్నాన్ని) ఖండించాలి’’ అని పోసాని కోరారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... 

ఆంధ్రాలో కమ్మవారి పరిస్థితి ఏమిటో తెలుసా? 
నేను కమ్మవాణ్ణి. ఆంధ్రాలో ఉన్న మా కులంవారి పరిస్థితి ఏమిటో మీకు తెలుసా? చంద్రబాబు, టీడీపీ కారణంగా కమ్మవారిని అంటరాని వారి కింద జనం చూస్తున్నారు. మనం కమ్మవారం.. మన కులంవారికే ఓట్లేయాలి. కాపులకు, రెడ్లకు వేయరాదని అందరికీ ఎక్కించారు. మరి మన కులం వారు మాత్రమే ఓట్లేస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారా? అంత సంఖ్య మన కులం వారికి ఉందా? మరి మన కులంవారికి ఎందుకంత కమ్మపిచ్చి ఎక్కించారు? కుల దురద ఎందుకు పుట్టించారు? బ్రోకరైనా, లోఫరైనా మన కులం వారికే ఓటు వేయాలని దురద ఎక్కించారు. తెలంగాణలో కమ్మవారికి ఈ పిచ్చి లేదు. లగడపాటి రాజగోపాల్‌ సర్వే గురించి ప్రస్తావించాలంటేనే సిగ్గేస్తోంది. సైబరాబాద్‌ నిర్మాణానికి కాంగ్రెస్‌ వారు శంకుస్థాపన చేస్తే చంద్రబాబు దాని చుట్టూ స్థలాలు కొని ప్రయోజనం పొందారు. సైబరాబాద్‌ నేనే కట్టాను అని చంద్రబాబు చెప్పడం ఏమిటి? ఆయన సైబరాబాద్‌ చుట్టుపక్కల పొలాలను కొని వాళ్ల వాళ్లను అభివృద్ధి చేశాడు అంతే. ఈ రోజు అమరావతిలో చంద్రబాబు చేసిందదే. ఆ చుట్టుపక్కల భూములన్నీ వాళ్లవే. ఇవాళ మీరెళ్లండి అమరావతి చుట్టుపక్కల భూములన్నీ మా (ఓ సామాజికవర్గం) వాళ్లవే. కేసీఆర్‌ ఏమీ మా కులపోడు కాదు. కేసీఆర్‌ చేస్తున్న పనులు మంచివి కావడం వల్లే నేను ఆయన గెలవాలని కోరుకున్నా.  నిజాయితీగా పని చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే ఆంధ్రాలో తహసీల్దారు వనజాక్షిని చెప్పుతో కొట్టిన వారిని ఎందుకు అరెస్టు చేయించలేదు?  

విపక్ష నేతపై దాడి జరిగితే కనీసం పరామర్శించరా? 
విపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిని చంపబోతే ముఖ్యమంత్రిగా ఉన్న వారు కనీసం ఇంటికెళ్లి పరామర్శించరా? బిజీగా ఉంటే కనీసం పత్రికా ముఖంగా ఖండించారా? కేబినెట్‌ ర్యాంకు ఉన్న విపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే సీబీఐ విచారణకు ఆదేశించరా? జగన్‌ను చంపేందుకు కత్తితో పొడిస్తే పొడిచిన వాడు జగన్‌ మనిషా? ఎక్కడైనా నా మనిషి నన్ను పొడుస్తారా? ఇలా పొడిపించుకోవాల్సిన ఖర్మ జగన్‌కు ఏమిటి? జగన్‌కు ఉన్నంత ప్రజాదరణ రాష్ట్రంలో ఎవరికీ లేదు. చంద్రబాబుకు అసలు లేదు’’ అని పోసాని తేల్చిచెప్పారు.  

జగన్‌ సీఎం అయితే రాష్ట్రం బాగుపడుతుంది 
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అవినీతికి పాల్పడలేదు. ఆయనను అన్యాయంగా కేసుల్లో ఇరికించారు. ఆంధ్రప్రదేశ్‌లో నా మద్దతు జగన్‌కే. జగన్‌ నడత మంచిదని, నడక మంచిదని, క్యారెక్టర్‌ ఉన్న వ్యక్తి.  స్థిరత్వం ఉన్న వ్యక్తి, సమర్థుడు. అలాంటి వ్యక్తి అవినీతికి పాల్పడ్డాడంటే నేను నమ్మను. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు వాయిస్‌ (గళం) వినిపించలేదా! ఏనాడైనా జగన్‌ వాయిస్‌ అలా వినిపించిందా? అసలు అది నా వాయిస్‌ కాదని చంద్రబాబు ఒక్కసారైనా చెప్పాడా? అదీ జగన్‌కు, చంద్రబాబుకు మధ్య ఉన్న తేడా. ఏపీలో జగన్‌ గెలుస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం చాలా బాగుపడుతుంది. జగన్‌ గెలిస్తే కుల పిచ్చి, మత పిచ్చి, వర్గాల పిచ్చి ఉండదు. గూండాయిజం ఉండదు. జగన్‌ తన ప్రచారమేదో తాను చేసుకుంటూ వెళుతున్నారు. ఆయనను అనవసరంగా గిల్లడం తప్పు. అసెంబ్లీ నుంచి పారిపోయాడని, మరొకటని, ఇంకొకటని జగన్‌ను పవన్‌ గిల్లడం తప్పు కాదా! జగన్‌ అసెంబ్లీ నుంచి పారిపోతున్నాడని పవన్‌ అన్నారు. అసెంబ్లీలో జగన్‌ను అసలు మాట్లాడనిచ్చారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement