
పట్నా : ఎన్నికలు సమీపిస్తుండటంతో బిహార్‌లో రాజకీయ వేడి మొదలైంది. అధికార జేడీయూ, ప్రతిపక్ష ఆర్జేడీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పాలనలపై ఇరుపార్టీల నేతలు పరస్పరం వ్యంగ్యాస్త్రాలు సందించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లాలూ గత 15 ఏళ్ల పాలనపై పట్నాలో జేడీయూ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. లాలూ హయాంలో రాష్ట్రమంతా నేరాలు, ప్రమాదాలు, దాడులు, ఆకలిచావులు, సంక్షోభంతో రాష్ట్రం రావణకాష్టంగా మారిందనేది ఆ పోస్టర్ సారాంశం. దీనితో పాటు జీడీయూ పాలనపై ఓ ఫ్లెక్సీనీ ఏర్పాటు చేశారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉందని, సుభిక్షంగా, అభివృద్ధి పథకంలో నడుస్తుందనే అర్థం వచ్చే విధంగా దానిని ఏర్పాటు చేశారు.
అయితే లాలూను కించపరిచేవిధంగా ఉన్న పోస్టర్‌పై ఆర్జేడీ గట్టి సమాధానమే ఇచ్చింది. నితీష్ పాలనలో చిన్నారుల మరణాలు, రైతుల ఆత్మహత్యలు, తీవ్ర కరువుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కౌంటర్‌గా ఓ పోస్టర్‌ను ఏర్పాటు చేసింది. దీంతో ఇరు పార్టీల మధ్య పోస్టర్ వార్ నడుస్తోంది. రాష్ట్రంలో సరైన పాఠశాలలు ఏర్పాటు చేయలేని ప్రభుత్వం గోవులకు మాత్రం వందల కోట్లుఖర్చు చేసి గోశాలలు నిర్మిస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి శక్తి యాదవ్ మండిపడ్డారు. ఉపాధ్యయుల నియమాకాల్లో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. వివాదాస్పద పోస్టర్‌పై నితీష్ కుమార్ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా మరో కొన్ని నెలల్లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగునున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment