పోలీసులతో బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తల వాగ్వాదం ,మంత్రి ప్రదీప్త మహారథి
కాలు జారి పడితే నయం చేయించుకోవచ్చు కానీ..నోరు జారితే వెనక్కు తీసుకోవడం కుదరని పని అని ఉవాచ. సరిగ్గా అలాగే జరిగింది రాష్ట్ర మంత్రి ప్రదీప్త మహారథి విషయంలో. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, మంత్రి పదవికి ఆయన అనర్హుడని, తక్షణమే రాజీనామా చేసి క్షమాపణలు చెప్పాలంటూ మహిళలు ఆగ్రహోదగ్రులయ్యారు. ఈ క్రమంలో మంత్రి నివాసాన్ని ముట్టడించడానికి ఉద్యుక్తులయ్యారు. అయితే ఇదంతా మీడియా వక్రీకరణ అంటూ మంత్రి వివరణ ఇచ్చారు.
భువనేశ్వర్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రదీప్త మహారథి మహిళలపట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణతో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా కార్యకర్తలు మంత్రి ప్రభుత్వ క్వార్టర్‌ను బుధవారం ముట్టడించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు, పోలీస్ వర్గాల మధ్య తొక్కిసలాట జరిగింది. ఆయన నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించిన సందర్భంలో మహిళలపట్ల ఎటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని మంత్రి సంజాయిషీ ఇచ్చారు. మహిళలపట్ల మంత్రి చేసిన వ్యాఖ్యలను పురస్కరించుకుని క్షమాపణ చెప్పాలని మహిళా వర్గం పట్టుబట్టింది. మంత్రి పదవి నుంచి ప్రదీప్త మహారథిని తక్షణమే తొలగించాలంటూ మహిళలు నినాదాలు చేశారు.
సోషల్ మీడియాలో వైరల్..
భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా కార్యవర్గ సమావేశం పూరీలో రెండు రోజుల క్రితం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ కార్యక్రమంలో పాల్గొని మహిళల్ని ఉద్దేశించి ప్రసంగించారు. పూరీ జిల్లాలో ప్రదీప్త మహారథి బలమైన నాయకుడు. ఈ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రదీప్త మహారథి ఇలా వ్యాఖ్యానించారు. ఒక ఆడది వస్తే వాళ్ల భర్తలతో సభకు హాజరు రెండింతలు అవుతుందని మంత్రి మంగళవారం వ్యాఖ్యానించారు. ఈ లెక్కన ఒక మహిళతో ఇద్దరు భర్తలు హాజరవుతారనే శీర్షికతో మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో జోరుగా ప్రసారమయ్యాయి. భారతీయ మహిళపట్ల ఇటువంటి బలహీన వ్యాఖ్యలు చేయడం అత్యంత విచారకరమంటూ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా విరుచుకు పడింది. ఒక్కో మహిళకు ఇద్దరు భర్తలు అని మంత్రి చేసిన వ్యాఖ్యలు భారతీయ సంప్రదాయానికి కళంకమంటూ మహిళా వర్గం తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆయన మంత్రిగా కొనసాగే నైతిక విలువల్ని కోల్పోయారని మహిళా వర్గం విరుచుకు పడింది. మహిళకు ఇద్దరు భర్తల వ్యాఖ్యల్ని వెనుకకు తీసుకుని, చేసిన తప్పిదానికి ఆయన మహిళా వర్గానికి క్షమాపణ చెప్పాలనే నినాదాలతో బుధవారం ఉదయం మంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు విఫలయత్నం చేశారు.
అదంతా మీడియా దుమారం: మంత్రి
మీడియా రేపిన దుమారంతో ఈ విచారకర పరిస్థితులు తాండవించాయని మంత్రి ప్రదీప్త మహారథి వాపోయారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పూరీ పట్టణంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నిర్వహించిన సమావేశానికి విశేష సంఖ్యలో హాజరైన మహిళా ప్రతినిధుల గురించి తన స్పందనను మీడియా తప్పు దారి పట్టించి దుమారం రేపిందని మంత్రి విచారం వ్యక్తం చేశారు.
మంత్రి వివరణ ఇలా ఉంది
నా నియోజక వర్గంలో మహిళలతో సమావేశం నిర్వహిస్తే ఆ సభకు కూడా రెండింతల మంది ప్రజలు హాజరవుతారు. ప్రతి మహిళతో ఆమె భర్త కూడా హాజరు కావడంతో జనం హాజరు రెండింతలవుతుంది. ఇలా తన నియోజకవర్గంలో 30 వేల మంది మహిళలు వాళ్ల భర్తలతో కలిసి వస్తారని ఆహాజరు 60 వేలకు తాకుతుందని మంత్రి ప్రదీప్త మహారథి జారీ చేసిన గణాంకాలు స్వల్పంగా దారి తప్పడంతో దుమారం రేగింది. 30 వేల మంది మహిళలకు 60 వేల మంది భర్తలా..అంటే ..ఒక్కో మహిళకు ఇద్దరు భర్తలా..అనే శీర్షికతో సోషల్ మీడియాలో ప్రసారం వ్యాపించింది. 30 వేల మంది మహిళలతో వాళ్ల భర్తలు హాజరైతే మరో 30 వేల మందితో హాజరు రెండింతలవుతుందనే విషయాన్ని మీడియా తలకిందులుగా లెక్కించి చిక్కు సమస్యల్ని ఆవిష్కరించిందని మంత్రి వాపోయారు. మహిళా ఓటర్ల ఆశీస్సులు, ఆదరణతో పూరీ జిల్లాలోని పిప్పిలి నియోజకవర్గం నుంచి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తాను మహిళలపట్ల ఇటువంటి వ్యంగ్య వ్యాఖ్యలు చేయబోనని మంత్రి వివరించారు.
మంత్రి భవనం ఆవరణలో ఉద్రిక్తత
మంత్రి ప్రదీప్త మహారథి ప్రభుత్వ క్వార్టర్ ఆవరణలో బుధవారం ఉదయం యుద్ధ వాతావరణం నెలకొంది. మంత్రి నివాసానికి ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా కార్యకర్తలు ఇంటి ముట్టడి ఆందోళనకు దిగడంతో ఈ పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment