సాక్షి, గుంటూరు : నాలుగేళ్లుగా 5 కోట్ల ఏపీ ప్రజానీకాన్ని మోసం చేస్తున్న చంద్రబాబు వ్యవహారం క్లైమాక్స్‌కు చేరినట్లేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం గుంటూరు కింగ్ హోటల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ముందుగా ఎండల్ని సైతం లెక్కచేయకుండా తన వెంట నిలుస్తున్న ప్రజానీకానికి అభివాదం చేసి ఆయన ప్రసంగాన్ని ఆయన కొనసాగించారు.
కనుచూపు మేరలో సీఎం ఆఫీస్... ‘ఇక్కడికి కొద్దికిలోమీటర్ల దూరంలోనే సీఎం క్యాంప్ ఆఫీసు కనిపిస్తోంది. అయినా గుంటూరులో దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరిట ఇష్టానుసారం తవ్వకాలు జరిపారు. కనీసం 20 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. తాగటానికి కనీసం మంచి నీరు కూడా దొరకటం లేదు. తాగేది మంచి నీరా? మురుగు నీరా? అన్నది ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. డయేరియా వ్యాధితో తమ వాళ్లు చనిపోతున్నారని.. అధికారులు కనీసం పట్టించుకోవట్లేదని ఇక్కడి ప్రజలు చెబుతుంటే గుండె తరుక్కుపోతోంది. సుమారు 20 మంది చనిపోయారని అధికారులు లెక్కలు చెబుతుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోనీ.. బాధిత కుటుంబాలకు పరిహారమైన సరిగ్గా ఇచ్చారా? అంటే అది లేదు. గాలికొదిలేశారు’ అని జగన్ ప్రసంగించారు.
జీజీహెచ్ ప్రత్యక్ష ఉదాహరణ... డయేరియా మరణాలకు తోడు గుంటూరు ప్రభుత్వాసుపత్రి(జీజీహెచ్) నిత్యం వార్తల్లో నిలుస్తోంది. 10 రోజుల పసికందును ఎలుకలు కొరికి చంపడం.. పాములు కనిపిస్తే పేషంట్లు పరుగులు తీయటం.. చిన్న పిల్లలు కిడ్నాప్‌లకు గురికావటం.. చివరకు జనరేటర్లు లేక సెల్‌ఫోన్ వెలుతురులో ఆపరేషన్లు జరిగిన దారుణమైన పరిస్థితులు కనిపించాయి. వీటన్నింటికి కారణం ఈ అసమర్థ ప్రభుత్వం కాదా? అని జగన్ నిలదీశారు. పేదల జీవితంతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఫ్లాట్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. రూ.3లక్షలు విలువ చేసే ఫ్లాట్లను రూ.6లక్షలకు అంటగడుతూ.. కాంట్రాక్టర్లతో కలిసి చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారని జగన్ మండిపడ్డారు.
ఇదేనా హైటెక్ పాలన?... ‘పాలన పరంగా అభివృద్ధికి నోచుకోకపోగా.. ప్రజల జీవితాలు మరింత అంధకారంలోకి వెళ్లిపోయాయి. ఈ నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు చేసింది ఏదైనా ఉందా? అంటే.. మోసం చేయటం.. అబద్ధాలు చెప్పటం.. విచ్చల విడి అవినీతి. మట్టి నుంచి ఇసుక దాకా.. దేన్నీ వదల్లేదు. చివరకు గుడి భూములను కూడా మింగేశారు. ఇదేనా హైటెక్ పాలన అంటే?... పైన చంద్రబాబు-గ్రామాల్లో జన్మభూమి కమిటీలు లంచాలు లేకుండా పనులు చేయట్లేదు. మరుగుదొడ్ల విషయంలో కూడా అవినీతే’ అని వైఎస్ జగన్ ఆక్షేపించారు. ఇక పేరే చర్ల ఘోర ప్రమాదం తాలుకూ బాధిత కుటుంబాల ఆవేదనను జననేత ప్రజలకు వినిపించారు. ఈ సందర్భంగా ఆడపడుచుల కన్నీళ్లను చూసైనా బుద్ది తెచ్చుకోవాలని చంద్రబాబుకు జగన్ సూచించారు.
ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉందా?
ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ది ఉందా? అని ప్రజల తరపున వైఎస్ జగన్ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం మీద వైఎస్సార్‌సీపీ అవిశ్వాస తీర్మానం పెట్టకపోయి ఉంటే.. చంద్రబాబు అవిశ్వాసం ప్రస్తావన తెచ్చేవాడా? అని నిలదీశారు. మార్చి 15న వైఎస్సార్‌సీపీ అవిశ్వాసానికి మద్ధతు ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. మరుసటి రోజే యూటర్న్ తీసుకున్నారన్నారు. ‘మొత్తంగా ఉన్న 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగొస్తుందని చెబుతున్నప్పటికీ.. ఈ పెద్ద మనిషి(చంద్రబాబును ఉద్దేశించి) రాజీనామాలు చేయించనని చెబుతున్నాడు. పైగా రాజీనామాల గురించి ప్రస్తావించని మనిషి ఇప్పుడు అవినీతిపై కేంద్రం ఎక్కడ విచారణ జరిపిస్తుందోనన్న భయంతో ఇతర పార్టీల మద్ధతు కూడగట్టేందుకు ఢిల్లీ వెళ్లాడు. చంద్రబాబు తరపున రాజీనామాల నిర్ణయం ఏదైనా.. మా ఎంపీలు మాత్రం రాజీనామా చేసి ఏపీ భవన్‌లో ఆమరణ దీక్ష చేస్తారు’ అని జగన్ ఉద్ఘాటించారు. ఆమరణ దీక్షకు కూర్చుంటే దేశం మొత్తం చర్చిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా దిగివస్తుందని జగన్ చెప్పారు.
ఒక్కసారి ఆలోచన చేయండి.. ‘చంద్రబాబును మరోసారి నమ్మి మోసపోకండి. ఈసారి మిమల్ని ప్రలోభ పెట్టడానికి పెద్ద పెద్ద మోసాలకు తెరలేపుతాడు. ఇచ్చేదంతా తీసుకోండి. అదంతా ప్రజలను దోచేసి ఆయన సంపాదించిన సొమ్మే. కానీ, ఓటు మాత్రం మనస్సాక్షి ప్రకారం వేయండి’ అని జగన్ ప్రజలను కోరారు.
నవరత్నాలు... ‘పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివించలేని స్థితిలో ప్రజలు ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటుకానున్న ప్రజా ప్రభుత్వం ఏమేమి చెయ్యబోతున్నదో ‘నవరత్నాల’ ద్వారా ఇప్పటికే ప్రకటించాం. అందులో పేద పిల్లల చదువులు, పెన్షన్ల అంశాలను మరొకసారి గుర్తుచేసుకుందాం. పిల్లలు ఇంజనీరింగో, మెడిసినో చదవాలంటే లక్షల ఫీజు కట్టాలి. చంద్రబాబు రూ.30 వేలిచ్చి సరిపెడుతున్నారు. అదే మన ప్రభుత్వం వస్తే పిల్లల చదువులకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. విద్యార్థులు హాస్టళ్లలో ఉండటానికి వీలుగా మెస్‌చార్జి కింద ఏటా రూ.20 వేలు చెల్లిస్తాం. అప్పులబారినపడి ఏ తల్లిదండ్రీ పిల్లల్ని స్కూలుకు పంపించని పరిస్థితి రావద్దు. అందుకే పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికి నెల నెలా రూ.15 వేలు అందిస్తాం. అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా మీ పిల్లల్ని చదవిస్తా’ అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment