పట్నా : బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి విమర్శల దాడికి దిగారు. ఆదివారం పట్నాలో నిర్వహించిన జేడీయూ బహిరంగ సభలో నితీష్ ప్రసంగించిన విషయం తెలిసిందే. రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 200 సీట్లకు పైగా జేడీయూ విజయం సాధిస్తుందన్న... సీఎం వ్యాఖ్యలపై ప్రశాంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. సభలో సుధీర్ఘ ప్రసంగం చేసిన నితీష్.. ఢిల్లీ అల్లర్లపై కనీసం స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. రాజధాని ఘర్షణలో 46 మంది పౌరులు మరణిస్తే సీఎం హోదాలో ఉన్న వ్యక్తి నోరు మొదపకపోవడం దారుణమన్నారు. అలాగే అభివృద్ధి, విద్యా, వైద్యంలో బిహార్ ఇప్పటికీ ఎందుకు వెనుకబడిందో ఆయన స్పష్టం చేయాలని పీకే డిమాండ్ చేశారు. ఐదేళ్ల కాలంలో ఏం చేశారో చెప్పకుండా.. కేవలం రాజకీయ ప్రచారం కోసమే సభ నిర్వహించారని విమర్శించారు. ఈ మేరకు సోమవారం ట్విటర్ వేదికగా నితీష్‌పై విమర్శలకు దిగారు. (రాజ్యసభకు ప్రశాంత్ కిషోర్..!)
శనివారం పట్నాలో నిర్వహించిన బహిరంగ సభలో నితీష్ కీలక అంశాలను ప్రస్తావించిన తెలిసిందే. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పొత్తు కొనసాగుతుందని, మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంటామని స్పష్టం చేశారు. కాగా అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. వివాదాస్పద చట్టాల నేపథ్యంలో కేంద్రంపై పోరు కొనసాగిస్తూనే.. రాష్ట్రంలో అధికార పార్టీయే టార్గెట్‌గా విమర్శలకు పదునుపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని నిరుద్యోగులను, విద్యార్థులను ప్రత్యక్షంగా కలిసేందుకు 100 రోజుల ప్రణాళికను ప్రశాంత్ ఇదివరకే రూపొందించారు. మరోవైపు టీఎంసీ నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికవుతారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై ఆయన ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment