పట్నా: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గాంధీ భావజాలాన్ని సమర్థిస్తారో, గాంధీని చంపిన గాడ్సేని సమర్థిస్తున్నవారితో చేతులు కలుపుతారో తేల్చుకోవాలని స్పష్టం చేశారు. నితీశ్ ప్రభుత్వ అభివృద్ధి నమూనాపై ప్రశ్నల వర్షం కురిపించారు. తన భావజాలాన్ని పక్కనపెట్టి నితీశ్ ప్రభుత్వం బీజేపీతో చేతులుకలపడాన్ని దుయ్యబట్టారు. పౌరసత్వ సవరణ చట్టంపై తన వ్యతిరేకతను స్పష్టంచేసిన ప్రశాంత్ కిశోర్, గాంధీ, జయప్రకాష్ నారాయణ్, రామ్‌మనోహర్ లోహియాల సిద్ధాంతాలనూ, ఆదర్శాలనూ ఎన్నటికీ వీడబోనని ఎప్పుడూ చెపుతూ ఉండే నితీశ్ నాథూరాం గాడ్సేని సమర్థించే వారితో ఎలా ఉండగలుగుతారని ప్రశాంత్ కిశోర్ సూటిగా ప్రశ్నించారు.
నితీశ్ బీజేపీ వైపు ఉండదల్చుకుంటే మాకేం అభ్యంతరం లేదనీ, అయితే ఇటు గాంధీ ఆదర్శాలను సమర్థిస్తూ, అటు గాడ్సే మద్దతుదారులతో చేతులుకలుపుతానంటే కుదరదన్నారు. ఉత్తమ టాప్ 10 రాష్ట్రాల్లో బిహార్‌ను ఒకటిగా చేసేందుకే 20వ తేదీన ‘‘బాత్ బిహార్‌కీ’కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో యువనాయకులను తయారుచేసే దిశగా కృషిచేస్తానని తెలిపారు. వంద రోజుల్లో కోటిమంది యువతను కలుస్తానన్నారు. ప్రశాంత్ వ్యాఖ్యలపై జేడీ(యూ) స్పందించింది. నితీశ్‌ను విమర్శించే బదులు తన విలువైన సమయాన్ని ‘వ్యాపారం’కోసం ప్రశాంత్ కేటాయిస్తే మంచిదని పార్టీ నేత కేసీ త్యాగి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment