న్యూఢిల్లీ: తానెవరో తెలియదంటూ కేంద్ర మంత్రి, బీజేపీ నేత హర్దీప్ సింగ్ పూరి చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్ యునైటెడ్ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ స్పందించారు. తన లాంటి సామాన్యుల గురించి ఉన్నత పదవిలో ఉన్న మంత్రికి తెలియకపోవడం సాధారణ విషయమే అన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ(బీజేపీ) ప్రధానిగా గెలుపొందడం, నితీష్ కుమార్(జేడీయూ) బిహార్ ముఖ్యమంత్రిగా విజయం సాధించడం వెనక ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కీలకంగా పని చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా పలు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలకు సైతం ప్రశాంత్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి విజయాలు అందించారు. దీంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది.
ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ పీకే బృందంతో జట్టుకట్టారు. దీంతో కిషోర్ నేత్వంలోని ఐపాక్ టీం తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచార వ్యూహాలు రచించనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కో- ఇంచార్జిగా వ్యవహరిస్తున్న కేంద్ర మంత్రి హర్దీప్ పూరి ప్రశాంత్ కిషోర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘ అసలు ప్రశాంత్ కిషోర్ ఎవరు’ అని ప్రశ్నించారు.(రంగంలోకి ప్రశాంత్ కిషోర్ టీం!)
ఇందుకు బదులుగా పీకే గురించి విలేకరులు ప్రస్తావించడంతో.. ‘ అతడి గురించి నేను తెలుసుకోవాల్సింది.. కానీ నాకు అతనెవరో తెలియదు’ అని వ్యాఖ్యానించారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన పీకే.. ‘ఆయన ఒక సీనియర్ మంత్రి. నాలాంటి సామాన్యుల గురించి ఆయనకు ఎలా తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్- బిహార్ రాష్ట్రాల నుంచి నాలాగా ఢిల్లీకి వచ్చిన ఎంతో మంది ఇక్కడ జీవనపోరాటం చేస్తున్నారు. ఆ లక్షల మందిలో ఒక్కడినైన నా గురించి కేంద్ర మంత్రికి తెలిసే అవకాశమే ఉండదు కదా’ అంటూ వినయపూర్వకంగానే హర్దీప్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.(అరవింద్ కేజ్రీవాల్‌తో పీకే టీం)
ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ‘అవసరం ఉన్నపుడు అతడి సేవలు వినియోగించుకుని.. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ తరఫున అతడు ప్రచారంలోకి దిగగానే ఎవరని ప్రశ్నిస్తారా? కనీసం ఎన్డీయేలో భాగస్వామ్యమైన జేడీయూ ఉపాధ్యక్షుడని కూడా తెలియకపోవడం ఏంటి’ అని ప్రశ్నిస్తున్నారు.
Prashant Kishor,Political Strategist on Union Min HS Puri asking 'Who is Prashant Kishor?': He is a senior minister,why will he know a ordinary man like me?In Delhi lakhs of ppl like me from UP-Bihar live and struggle,how will such a senior leader like Puri ji know so many ppl? pic.twitter.com/n9TW1WCCvb
— ANI (@ANI) December 28, 2019
Comments
Please login to add a commentAdd a comment