
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి కట్టిన కాంగ్రెస్ పార్టీని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఓవైపు భాగ స్వామ్య పార్టీలకు కేటాయించాల్సిన సీట్ల లెక్కలు తేలక సతమతమవుతుండగా.. మరోవైపు సొంత పార్టీలో రాజుకుంటున్న అసమ్మతి కుంపట్లు కల వరం కలిగిస్తున్నాయి. టికెట్ల ప్రకటన వెలువడక ముందే అసమ్మతి గళాలు అంతకంతకూ పెరుగు తున్నాయి.
కాంగ్రెస్ నేతలు సాక్షాత్తూ గాంధీభవన్ వేదికగానే నిరసనల కార్యక్రమాలు చేస్తుండగా.. తమకు సీట్లు దక్కే అవకాశం లేదని తెలియడంతో తెలంగాణ ఉద్యమకారులు, ఉస్మానియా విద్యార్థి నేతలు సైతం హస్తం పార్టీపై గుర్రుగా ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే.. టికెట్ల కేటాయింపులో డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలు పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టికెట్ల కేటాయింపులో కీలకంగా భావిస్తున్న ఓ నాయకుడి కుమారుడు డబ్బులు తీసుకున్నాడని కొందరు ఆశావహులు బహిరంగంగానే చెబుతుండగా.. ఇందుకు సంబంధించి తమ వద్ద వీడియో రికార్డింగ్‌లు కూడా ఉన్నాయని మరికొందరు చెబుతున్నారు. మొత్తమ్మీద ఈ వ్యవహారం ఎటు నుంచి ఎటు వైపు వెళ్తుందో అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వాళ్లకెలా ఇస్తారు?
కాంగ్రెస్‌లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లా ల్లోనూ అసమ్మతులు ఉన్నప్పటికీ.. నల్లగొండ, వరం గల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఇది చాలా ఎక్కువగా ఉంది. సొంత పార్టీలో టికెట్లు దక్కవని భావిస్తున్న ఆశావహులు, పొత్తుల్లో భాగంగా కూటమి పార్టీలకు వెళ్లే స్థానాలకు చెందిన కాంగ్రెస్ నేతలు తమ నిరసన గళాన్ని గట్టిగానే వినిపిస్తు న్నారు. పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలకు.. ముఖ్య ంగా టీజేఎస్‌కు ఇస్తున్న స్థానాలపై కాంగ్రెస్‌లో అసమ్మతి భగ్గుమంటోంది. వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్ పూర్, జనగామ, మల్కాజ్‌గిరి, వరంగల్ వెస్ట్ స్థానా ల్లో తమకే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు బహి రంగ ప్రకటనలు చేస్తున్నారు.
పీసీసీ మాజీ అధ్య క్షుడు పొన్నాల లక్ష్మయ్యను కాదని, టీజేఎస్ అధినేత కోదండరాం జనగామ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం పెద్ద ప్రకంపనలే సృష్టిస్తోంది. బీసీ సామా జిక వర్గానికి చెందిన పార్టీలోని కీలక నేత పోటీ చేయాల్సిన స్థానాన్ని మరో పార్టీకి కేటాయించి అగ్ర వర్ణాలకు చెందిన అభ్యర్థిని ఎలా నిలబెడతారనే చర్చ మొదలైంది. మరోవైపు పొన్నాల కూడా దీనిపై స్పం దిస్తూ.. పార్టీ అధిష్టానం అలాంటి నిర్ణయం తీసుకోబోదని వ్యాఖ్యానించారు. ఇక, వరంగల్ వెస్ట్ స్థానంలో నాయిని రాజేందర్‌రెడ్డి దూకుడుగానే వ్యవ హరిస్తున్నారు. ఈ స్థానాన్ని ఇతరులకు ఇస్తే చూస్తూ ఊరుకోవడానికి కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా లేరని ఆయన ప్రకటించడం పార్టీపై పరోక్షంగా తిరుగు బాటు సంకేతాలను సూచి స్తోంది.
స్టేషన్ ఘన్‌పూర్ స్థానాన్ని టీజేఎస్‌కు ఇచ్చి అక్కడ టికెట్ ఆశిస్తున్న ఇందిరను వర్ధన్నపేట నుంచి పోటీచేయాలని సూచించి నట్టుగా జరుగు తున్న ప్రచారం ఆ రెండు నియోజకవర్గా ల్లోనూ కలకలం రేపు తోంది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఈ ప్రతిపాదనపై తీవ్ర అసంతృప్తితో ఉండగా, ఇందిర కూడా నియోజక వర్గం మారేందుకు సిద్ధంగా లేరు. మరోవైపు మహ బూబ్‌నగర్ స్థానాన్ని టీజేఎస్‌కు ఇచ్చి దేవర కద్ర, మక్తల్ సీట్లను టీడీపీకి ఇస్తు న్నారని జరుగుతున్న ప్రచారం ఆ జిల్లా కాంగ్రెస్ నేతల్లో కలవరం కలిగిస్తోంది.
దేవరకద్ర నుంచి కాంగ్రెస్ పార్టీనే పోటీ చేస్తుందని తమకు అధిష్టానం చెప్పిందని, మహ బూబ్‌నగర్ సీటును బీసీ కోటాలో టీడీపీకి ఇస్తున్నారని వారంటున్నారు. ఇక మల్కాజ్‌గిరి స్థానాన్ని ఆశిస్తున్న నందికంటి శ్రీధర్ ఏకంగా గాంధీభవన్‌లో తన అనుచరులతో కలిసి ధర్నాకు దిగారు. ఈ స్థానాన్ని టీజేఎస్‌కు ఇవ్వాలనే ప్రతి పాదనను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అలాగే టీజేఎస్‌కు ఇస్తారని ప్రచారం జరుగుతున్న మిర్యాలగూడ విషయంలోనూ ఇంకా స్పష్టత రావడం లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీనే పోటీ చేస్తుందని స్థానిక నేతలు అంటుంటే, టీజేఎస్ మాత్రం ఆ స్థానం తమకే వస్తుందని భావిస్తోంది.
నకిరేకల్ ఏమవుతుందో?
తెలంగాణ ఇంటి పార్టీకి ఓ సీటు ఇస్తున్నట్టు గురు వారం రాత్రి కుంతియా చేసిన ప్రకటన నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలను కుదిపేస్తోంది. అక్కడ బలంగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్‌కు చెక్ పెట్టేందుకే ఇలా చేశారని, ఎట్టి పరిస్థితుల్లోనూ నకిరేకల్‌ను వదు లుకునేది లేదని బ్రదర్స్ అనుచరులు స్పష్టం చేస్తున్నారు. నకిరేకల్ సీటును ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నార్కట్‌పల్లిలో రాస్తారోకోకు దిగారు.
మరోవైపు బ్రదర్స్ కూడా లింగయ్యకు ఎట్టి పరిస్థితుల్లో నకి రేకల్ నుంచి పోటీచేసే అవకాశం ఇవ్వాలని, లేదంటే తాము కూడా పోటీచేయబోమని అధిష్టానానికి అల్టిమేటం ఇవ్వడం గమనార్హం. ఇక టీడీపీకి కేటా యిస్తున్న శేరిలింగంపల్లి విషయంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కోసం హుస్నాబాద్‌ను ఆ పార్టీకి కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలో చిస్తుండగా, అక్కడ అల్గుబెల్లి ప్రవీణ్‌రెడ్డి అనుచరులు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలకు కేటాయించాలని భావి స్తున్న సీట్ల విషయంలో అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరించని కారణంగానే ఈ అసమ్మతి జ్వాలలు రేగుతున్నాయనే చర్చ జరుగుతోంది.
ఓయూ జేఏసీ, ఉద్యమకారులకు చోటేదీ?
ఈసారి టికెట్ల కేటాయింపులో పారా చూట్లకు స్థానం ఉండదని, ఓయూ జేఏసీ నేతలు, ఉద్యమకారులకు అవకాశం కల్పిస్తా మని రాహుల్‌గాంధీ స్వయంగా చెప్పారు. అయితే, పరిస్థితి అందుకు భిన్నంగా ఉందనే ప్రచారం జరుగు తోంది. ఇప్పటి వరకు ఖరారైన 74 మంది అభ్య ర్థుల జాబితాలో వీరికి అవకాశం దక్కలేదని అం టున్నారు. ఓయూ జేఏసీ నుంచి మానవతారాయ్‌తో పాటు దాదాపు 10 మందికి పైగా టికెట్లు ఆశించినా, కనీసం ఇద్దరు లేదా ముగ్గురిౖMðనా టికెట్లు వస్తాయని భావించారు.
అయితే, ఓయూ జేఏసీ నుంచి కేవలం మేడిపల్లి సత్యం (చొప్ప దండి)కి మాత్రమే టికెట్ ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోనే ఉన్న ఓయూ జేఏసీ నేతలు ఆందోళన బాట పట్టారు. తమకు టికెట్లు ఇవ్వాలని రాహుల్‌గాంధీ చెప్పారని, కానీ టీపీసీసీ నాయకత్వం మాత్రం తమ అను యాయులు, అనుచరులకు మాత్రమే టికెట్లు ఇచ్చేలా అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపిస్తు న్నారు.
తమకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవ కాశం కల్పించాలని లేదంటే తమ శవాలే తెలం గాణకు వెళ్తాయి తప్ప టికెట్లు వచ్చేంత వరకు తాము ఇక్కడి నుంచి కదిలేది లేదని వారు హెచ్చరించారు. ఇక ఉద్యమకారుల జాబితాలో గత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించిన అద్దంకి దయాకర్, గజ్జెల కాంతం, కత్తి వెంకటస్వామిలకు ఈ సారి అధి ష్టానం మొండిచేయి చూపినట్టు తెలుస్తోంది. ఇం దులో కత్తి వెంకటస్వామి ఆశిస్తున్న చోట కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా.. దయాకర్, కాంతంలకు టికెట్ వస్తుందని ఆశించారు. కానీ, వారికి కూడా అధిషా నం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకపోవడం చర్చకు దారితీస్తోంది.
ఆ రాష్ట్రాల్లో ఇచ్చారు.. ఇక్కడివ్వరా?
ఇక అనుబంధ సంఘాల కోటాలో చాలా మంది నేతలు టికెట్లు ఆశించారు. మహిళా, యువజన కాంగ్రెస్, సేవాదళ్, గిరిజన సంఘాలతో పాటు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షులు ఈసారి టికెట్లు వస్తాయన్న ధీమాలో ఉన్నారు. అయితే వీరిలో కూడా ఎవరికీ టికెట్ వచ్చే అవకాశం లేకపోవడంతో వారంతా టీపీసీసీ నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు.
మిజోరం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌తోపాటు మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షులకు అసెంబ్లీకి పోటీచేసే అవకాశం ఇచ్చారని.. తెలంగాణలో తమకెందుకు అవకాశం ఇవ్వడం లేదని ఎన్‌ఎస్‌యూఐ నేతలు ప్రశ్నిస్తున్నారు. వీరికి తోడు పార్టీకి దశాబ్దాలుగా సేవలు చేస్తూ గాంధీభవన్‌లో పనిచేస్తున్న ముగ్గురు, నలుగురు నాయకులు కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసుకుని గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే తమకు కూడా అవకాశం లేదనే సంకేతాలతో వారంతా ఆందోళనలో ఉన్నారు.
గాంధీభవన్‌కు తాళం..
అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న పలువురు నేతలు తమ అనుచరులతో కలిసి గాంధీభవన్‌లో నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మల్కాజ్‌గిరి టికెట్‌ను టీజేఎస్‌కు కేటాయించడంపై నందికంటి శ్రీధర్ వర్గ నేతలు అక్కడ ధర్నాకు దిగారు. టీజేఎస్‌కు టికెట్ ఇస్తే చిత్తుగా ఓడిస్తామని ప్రకటించారు. అలాగే ఖానాపూర్‌కు చెందిన నేతలు కూడా గాంధీభవన్‌లో ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్ గేట్లకు సిబ్బంది తాళాలు వేశారు. ఒక పక్క గేటును పూర్తిగా మూసివేయగా, రెండో గేటు నుంచి ఐడీ కార్డులు చూపించాకే లోనికి పంపిస్తున్నారు.
డబ్బులు ముట్టాయా?
అసమ్మతి ప్రకటనలు, నిరసనలు, ధర్నాలు, అల్టిమేటాలు ఒక ఎత్తైతే.. టికెట్ల కోసం డబ్బులు తీసుకున్నారంటూ వస్తున్న ఆరోపణలు కాంగ్రెస్‌ను కుదిపేస్తున్నాయి. టికెట్ల కేటాయింపులో కీలకపాత్ర పోషిస్తున్న ఓ నాయకుడి కుమారుడు డబ్బులు వసూలు చేశాడని, ఆయనకు కోట్ల రూపాయలు ముట్టాయని ఢిల్లీలోనే మకాం వేసిన ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన నేత ఒకరు ఆరోపించడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
హైదరాబాద్ శివార్లలోని ఓ నియోజకవర్గానికి చెందిన ఆశావహుడు ఒకరు తాను ఓ పెద్ద నాయకుడి బంధువుకు టికెట్ æకోసం డబ్బులిచ్చానని, అందుకు సంబంధించిన వీడియో రికార్డింగ్‌లు తన వద్ద ఉన్నాయని చెబుతుండడం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరోవైపు గాంధీభవన్‌లో ధర్నాకు దిగిన ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన నేతలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు.
రమేశ్ రాథోడ్ నుంచి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఆర్‌సీ కుంతియా రూ.5 కోట్లు, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రూ.3 కోట్లు తీసుకున్నారని, ఈ విషయాన్ని రాధోడ్ స్వయంగా నియోజకవర్గంలో చెబుతున్నారని ఖానాపూర్‌కు చెందిన నేతలు ఆరోపించారు. తమకు సమయం ఇస్తే సూట్‌కేస్‌లు ఎక్కడ మారాయో రుజువులతో సహా నిరూపిస్తామని ప్రకటించారు. మొత్తమ్మీద టికెట్ల కోసం డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు పార్టీలో పెద్ద దుమారాన్ని రేపనున్నాయని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment