
సాక్షి, హైదరాబాద్ : మహాకూటమి భాగస్వామ్య పక్షాల మధ్య లెక్కలు తేలినట్టేనా? గత కొన్ని రోజులుగా చర్చోపచర్చలు జరుపుతున్న కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ నేతల మధ్య అంగీకారం కుదిరినట్టేనా? కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా గురువారం రాత్రి చేసిన ప్రకటనకు కూటమిలోని పార్టీలు కట్టుబడి ఉంటాయా?– ఇవీ ప్రస్తుతం వినిపిస్తున్న ప్రశ్నలు. వాస్తవానికి కూటమిలో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, ఎక్కడెక్కడ పోటీ చేస్తుందనే విషయాలను కలసి ప్రకటిస్తామని కూటమి నేతలు చెబుతున్నారు.
కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లే ముందు రోజూ భాగస్వామ్య పార్టీలతో జరిపిన చర్చలు పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి కుంతియా చేసిన ప్రకటన కూటమి పార్టీల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది. పూర్తి అంగీకారం కుదరకముందే, ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న దానిపై కసరత్తు కొలిక్కి రాకముందే కాంగ్రెస్ ఏకపక్షంగా సీట్ల సంఖ్యను ప్రకటిం చిందనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రకటనకు కూటమిలోని ఇతర పక్షాలు కట్టుబడి ఉంటాయా లేక అందులోనూ మార్పుచేర్పులుంటాయా అనేదానిపై సందేహాలు నెలకొన్నాయి.
సంఖ్య సరే.. స్థానాలెక్కడ?
కాంగ్రెస్ పార్టీ 93 స్థానాల్లో, టీడీపీ 14, టీజేఎస్ 8, సీపీఐ 3, తెలంగాణ ఇంటి పార్టీ ఒక స్థానంలో పోటీ చేస్తాయని కుంతియా వెల్లడించారు. అయితే టీడీపీ 18 సీట్లు కావాలని అడుగు తున్నప్పటికీ, 14 స్థానాలకు
అంగీకరించే అవకాశాలున్నాయి. టీజేఎస్ 11 సీట్లు కావాలని అడుగుతుండగా, తమకు 4 స్థానాలైనా ఇవ్వాలని సీపీఐ పట్టుబడుతోంది. అయితే ఈ రెండు పార్టీల్లో టీజేఎస్‌కు 8, సీపీఐకి 3 సీట్లు కేటాయిస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. ఒకవేళ సీట్లు అటో ఇటో అయినా పోటీచేసే స్థానాలేంటనే దానిపై ఆసక్తి నెలకొంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలో తేల్చిన కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఏయే స్థానాలు ఏ పార్టీకి ఇవ్వాలన్న విషయంలో కూడా ఓ అవగాహనకు వచ్చి ఉంటుందని..
తమ అభిప్రాయాలు, వాదనలు వినకుండానే, చర్చలు పూర్తిస్థాయిలో జరగకుండానే సీట్ల సంఖ్యను ప్రకటించి బంతిని తమ కోర్టులోకి నెట్టిందని కూటమిలోని కీలక నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించి తాము ప్రతిపాదిస్తున్న స్థానాలపై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే జాబితా ప్రకటిస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలతో చర్చిస్తోందని.. ఒకటి రెండు చోట్ల తప్ప కూటమి పక్షాలతో పెద్దగా ఇబ్బంది లేదని కాంగ్రెస్ నేతలు చెబుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో కుంతియా చెప్పిన విధంగా అన్నీ సర్దుకుంటాయా... స్వల్ప మార్పులేమైనా ఉంటాయా అన్నది వేచిచూడాల్సిందే! శనివారం కాంగ్రెస్ తొలి జాబితా ప్రకటన ఉన్న నేపథ్యంలో ఏ పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేస్తుందనే అంశంపై అప్పుడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కాంగ్రెస్‌లోనూ ‘కుతకుత’
కూటమిలో సర్దుబాట్లు పూర్తిస్థాయిలో జరగక ముందే స్థానాల సంఖ్యను ప్రకటించిన కాంగ్రెస్‌లో అంతర్గతంగా సామాజిక సమీకరణలు కుదురుకోవడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా బీసీలకు కనీసం 34 స్థానాలు ఇవ్వాలని పార్టీలోని బీసీ నేతలు కోరుతుండగా, 32 సీట్లను ఇవ్వచ్చనే ప్రచారం జరిగింది. కానీ, తాజాగా జరుగుతున్న స్క్రీనింగ్ కమిటీ చర్చల అనంతరం ఈ సంఖ్య 25కు పడిపోయిందని కాంగ్రెస్‌లోని బీసీ నేతలంటున్నారు. బీసీలు ఆశిస్తున్న స్థానాలను పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలకు ఇస్తున్నారని.. శేరిలింగంపల్లి, జనగామ స్థానాలను వదులుకోకుంటే బీసీ నేతలే పోటీచేస్తారని వారంటున్నారు. దీనికి తోడు అగ్రవర్ణాలకు చెందిన నేతలు పోటీచేసే అవకాశమన్న స్థానాలను మాత్రం మిత్రపక్షాలు కోరుతున్నప్పటికీ, ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీసీల్లోనూ ఒకటి, రెండు సామాజిక వర్గాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని.. అత్యధిక జనాభా ఉన్న యాదవ, ముదిరాజ్ కులస్తులను సీట్ల కేటాయింపులో చిన్నచూపు చూస్తున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ‘‘యాదవులు, ముదిరాజ్‌లను ఆకర్షించేందుకు టీఆర్‌ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఆ సామాజికవర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు రెండు సామాజిక వర్గాలకు చెరో రాజ్యసభ సీటు ఇచ్చారు. ఎమ్మెల్యే సీట్ల విషయంలో కూడా సిట్టింగ్‌లందరికీ అవకాశం కల్పించారు. కానీ కాంగ్రెస్ మాత్రం మాకు 6 నుంచి 7 సీట్లు ఇచ్చేందుకు కూడా ఇబ్బంది పడుతోంది. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తోందో’’ అని ఢిల్లీలో ఉన్న బీసీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం భాగస్వామ్య పార్టీలకు కేటాయించిన సీట్లు ఇవీ..
టీడీపీ : శేరిలింగంపల్లి, ఉప్పల్, కూకట్‌పల్లి, చార్మినార్, మలక్‌పేట, అశ్వారావుపేట, ఖమ్మం, సత్తుపల్లి, మక్తల్, దేవరకద్రలతోపాటు, వరంగల్ ఈస్ట్ లేదా వెస్ట్‌లలో ఒకస్థానం. రాజేంద్రనగర్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, పఠాన్‌చెరు, కోదాడల్లో రెండు స్థానాలు.
టీజేఎస్ : జనగాం, మెదక్, మల్కాజ్‌గిరి, దుబ్బాక, సిద్దిపేట, రామగుండం, వర్దన్నపేట, మిర్యాలగూడ స్థానాలు ఖరారు కాగా.. చెన్నూరు, మహబూబ్‌నగర్, వరంగల్ (ఈస్ట్)లలో రెండు కావాలని టీజేఎస్ అడుగుతోంది.
సీపీఐ : బెల్లంపల్లి, వైరా, హుస్నాబాద్‌లు ఖరారయ్యాయని సమాచారం. అయితే, బెల్లంపల్లి బదులుగా మంచిర్యాల కావాలని సీపీఐ కోరుతోంది. అదనంగా కొత్తగూడెంతో పాటు నల్లగొండ జిల్లాలో ఏదో ఒక స్థానాన్ని ఆశిస్తోంది.
ఇంటిపార్టీ : నకిరేకల్ లేదా మునుగోడు
కాంగ్రెస్ చెప్పిన కూటమి లెక్క ఇదే...
పార్టీ పోటీ చేసే స్థానాల సంఖ్య
కాంగ్రెస్ 93
టీడీపీ 14
టీజేఎస్ 08
సీపీఐ 03
ఇంటిపార్టీ 01
మొత్తం 119
Comments
Please login to add a commentAdd a comment