
సాక్షి, అమరావతి : ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణతో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడికి భయం పట్టుకుందని డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి అన్నారు. అందుకే ఇంట్లోని ఆడవాళ్లను తెచ్చి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.. అమరావతిలో చంద్రబాబుతో కలిసి పర్యటించిన ఆయన సతీమణి భువనేశ్వరి ఆమె చేతికి ఉన్న బంగారు గాజులను రాజధాని రైతులకు అందించారు. ఈ విషయంపై స్పందించిన డిప్యూటీ సీఎం సచివాలయంలో మాట్లాడుతూ.. భువనేశ్వరి ఇవ్వాల్సింది గాజులు కాదు.. వాళ్ల భర్త అన్యాయంగా తీసుకున్న రైతుల భూములని స్పష్టం చేశారు.
రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో భూములు కొట్టేసింది మీ భర్త చంద్రబాబు కాదా అని భువనేశ్వరిని ప్రశ్నించారు. హెరిటేజ్ పేరుతో రాజధానిలో ఉన్న భూములపై భువనేశ్వరి లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. హెరిటేజ్ పేరుతో ఉన్న 14 ఎకరాల భూములను రైతులకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు 4 వేల ఎకరాలు దోచేసింది నిజం కాదా అని నిలదీశారు. ఆ 4వేల ఎకరాలు రైతులకిస్తే మీరు ఇచ్చిన గాజులకంటే ఎక్కువ మేలు చేస్తాయని అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవాలని చూడటం ధర్మం కాదని తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబు, భువనేశ్వరి వ్యతిరేకమని తేలిపోయిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment