సాక్షి, విజయనగరం: ఒక సాధారణ గిరిజన ఉద్యోగి కుటుంబానికి చెందిన ఆమెకు... మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై అభిమానం ఏర్పడింది. విద్యాభ్యాసం, ఉద్యోగం, వివాహం తర్వాత కూడా అది అంతకంతకూ పెరుగుతూ పోయింది. ఈ క్రమంలో అనూహ్యంగా దక్కిన రాజకీయ అవకాశం ఆమెను ఎమ్మెల్యే చేసింది. ఆ తర్వాత ప్రజా ప్రతినిధిగా, రాజకీయ నేత భార్యగా జీవితంలో సమతూకం పాటిస్తూ ప్రజల ఆదరాభిమానాలు గెలుచుకున్నారు. ఎవరూ వెళ్లేందుకు సాహసించని మారుమూల గిరిజన పల్లెల్లో ప్రతి గడప తొక్కుతూ, ప్రతి ఇంటి సమస్య తెలుసుకుని పరిష్కరిస్తూ జనం గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు విజయనగరం జిల్లా కురుపాం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి. మరోసారి ఇక్కడి నుంచే పోటీ చేస్తున్న పుష్ప శ్రీవాణితో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ వివరాలివీ..
పెళ్లి కాగానే రాజకీయాల్లోకి..
మాది పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామం. మేం ముగ్గురం అక్కా చెల్లెళ్లం. ఒక తమ్ముడు. నేను రెండో అమ్మాయిని. నాన్న నారాయణమూర్తి ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించారు. 10వ తరగతి వరకు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో, ఇంటర్ జంగారెడ్డిగూడెంలో చదివా. డిగ్రీ అక్కడే మహిళా కళాశాలలో పూర్తి చేశా. విశాఖ మద్దిలపాలెం కె.ఎన్.ఆర్.ఐ కళాశాలలో బీఈడీ అభ్యసించా.
జంగారెడ్డిగూడెంలోనే గిరిజన సంక్షేమ హైస్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా ఏడాదిన్నర పనిచేశా. మాకు బ్యాక్‌గ్రౌండ్ అంటూ ఏమీ లేదు కానీ చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే చాలా ఇష్టం. 2014లో మా పెళ్లి చూపుల సమయానికి సరిగ్గా ఎన్నికల ప్రక్రియ సాగుతోంది. అప్పుడే వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. వివాహమైన 15 రోజులకే నన్ను వైఎస్సార్‌సీపీ కురుపాం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా నియమించారు. మార్చి 14న పరీక్షిత్ రాజుతో పెళ్లయితే కొద్ది రోజులకే ప్రచారానికి దిగాను. మే 6న పోలింగ్. ఎమ్మెల్యేగా 19 వేల ఓట్ల పైగా మెజార్టీతో గెలిచా.
రాజన్న నాకు దైవం.. జగనన్నది గొప్ప వ్యక్తిత్వం
నేను 2004లో డిగ్రీ చేస్తుండగా అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి గెలుస్తారా? చంద్రబాబు గెలుస్తారా? అని మా స్నేహితుల మధ్య పందెం సాగింది. నేను చెప్పినట్టే రాజశేఖరరెడ్డి గెలిచారు. వేసవి సెలవుల్లో
చింతలపూడి దగ్గరున్న వెలగలపల్లిలోని స్నేహితురాలి ఇంటికి 15 రోజులు వెళ్లాను. అక్కడ రాజకీయాలు, వైఎస్ రాజశేఖరరెడ్డి పైనే చర్చలు సాగేవి.
అప్పుడు వైఎస్ అంటే అభిమానం ఇంకా పెరిగింది. వైఎస్ ఫొటోలను ఇంటి నిండా అంటించేశా. ‘మనం ఉద్యోగులం అలా చేయకూడదమ్మా’ అని నాన్న చెప్పినా వినేదాన్ని కాదు. నాకేదైనా కష్టం వస్తే ఇప్పటికీ రాజశేఖరరెడ్డి ఫొటో దగ్గరకు వెళ్లి చెప్పుకొంటా. జగనన్నది చాలా గొప్ప వ్యక్తిత్వం. అంత ఆప్యాయత ఏ నాయకుడిలోనూ చూడలేదు.
వైఎస్సార్ అని పచ్చ బొట్టు..
నేను, నా భర్త డబ్బుకి పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వం. విలువలకే మా ప్రాధాన్యం. దీనిని కూడా వైఎస్‌ను చూసి అలవర్చుకున్నాం. పార్టీ ఫిరాయింపు కోసం టీడీపీ నుంచి చాలామంది ఫోన్ చేసి ప్రలోభ పెట్టాలని చూశారు. కానీ, మేం దేనికీ లొంగలేదు. వైఎస్‌పై మా అభిమానం చాటడం కోసం చేతిపై ‘వైఎస్‌ఆర్’ అని పచ్చబొట్టు పొడిపించుకున్నా. ఇక ఇచ్చిన మాట కోసం, ప్రజల కోసం ఎన్ని కష్టాలెదురైనా తట్టుకుని నిలబడటం జగనన్న నుంచే నేర్చుకున్నా. రాజకీయాల్లోకి వచ్చాక వ్యక్తిగత జీవితం బాగా తగ్గిపోయింది. పెళ్లయిన తర్వాత రాజకీయ పర్యటనలే తప్ప ఇద్దరం ఎక్కడికీ వ్యక్తిగతంగా వెళ్లలేదు. ఐదేళ్లు కష్టపడ్డాం. జగనన్న సీఎం అయితే చాలు అంతా హ్యాపీగా ఉంటాం.
విడదీయరాని బంధం
2012 ఉప ఎన్నికల సమయంలో మా ప్రాంతానికి వచ్చిన జగన్నను కలిసేందుకు మూడు గంటల పాటు వేచి చూశా. కరచాలనం చేశాక జగనన్న నా తలపై చేయి వేసి ఆశీర్వదించారు.
ఆ క్షణం జీవితంలో మర్చిపోలేను. పరీక్షిత్‌తో వివాహానికి నిశ్చయించాక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి ఉంటుందని చెప్పగానే సంతోషంగా ఒప్పుకొన్నా. మొదటినుంచి మా కుటుంబం వైఎస్‌ఆర్ కుటుంబంతో ముడిపడి ఉంది. మా తమ్ముడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోనే బీటెక్ చదివాడు. ఇంకో మాట... జగనన్న సలహాతోనే మా పెళ్లి జరిగింది. అందుకే ఏటా మా పెళ్లి రోజు ఆయనను తప్పనిసరిగా కలిసి ఆశీసులు తీసుకుంటాం.
ప్రజా సేవలోనే సంతోషం
లక్ష్యం గొప్పదైనప్పుడు నడిచే దారిలో రాళ్లున్నా, ముళ్లున్నా లెక్క చేయొద్దు అనుకుంటూ ముందుకెళ్తా. ఈ రోజు మా నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా నన్ను వారి ఇంటి ఆడపడుచుగా చూస్తారు. నియోజకవర్గ పర్యటనకు వెళ్తే గిరిజనులు వాళ్లింటి అమ్మాయే ఎమ్మెల్యే అయినట్లు భావిస్తున్నారు. నేను కూడా వాళ్ల మధ్య కూర్చొనే భోజనం చేస్తా. వాళ్ల సమస్యలు వింటుంటా. వారం రోజులు గడప గడపకు వెళ్లడం, ఆ ఫొటోలన్నీ కలిపి ఐటీడీఏ పీవో, కలెక్టర్‌కు ఇవ్వడం ఇదే నా పని.
Comments
Please login to add a commentAdd a comment