
సాక్షి, హైదరాబాద్: ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేత శ్రీధర్‌బాబు ఎన్నికల సమయంలో తనపై అసత్య ఆరోపణలు చేయిస్తున్నారని మంథని టీఆర్‌ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. రూ. తొమ్మిది వందల కోట్లు సంపాదించానని ఆరోపణలు చేస్తున్నారని, ఎవరైనా రూ.రెండు కోట్లు ఇస్తే తన ఆస్తులు రాసిస్తానని అన్నారు. తనపై కేసులు ఉంటే శ్రీధర్‌బాబు మంత్రిగా ఉన్నప్పుడు వదిలి పెట్టేవారా.. అని ప్రశ్నించారు. మంగళవారమిక్కడి తెలంగాణభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఆధారాలు లేకుండా హైదరాబాద్‌లో నాపై ఫిర్యాదులు చేస్తే మీడియా ఇంత హైలైట్ చేస్తుందని అనుకోలేదు. ఇది బాధాకరం.
గుండా నాగరాజు హత్య కేసులో బిల్లా రమణారెడ్డి ముద్దాయి. ముద్దాయికి సాక్ష్యం చెప్పే అర్హత ఉంటుందా? నేను ఆ కేసులోనే లేను. ఆ కేసు కొలిక్కి వచ్చినందుకే నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. మీడియా నాపై ఇంత కక్ష ఎందుకు కట్టిందో అర్థం కావడం లేదు. మంథని కేంద్రంగా కొన్ని ముఠాలు ఏర్పడ్డాయి. నన్ను బద్నామ్ చేయడమే వాటి పని. నా మీద ఓడిపోయిన కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు నన్ను బద్నామ్ చేసేందుకు ఆ ముఠాలకు బాధ్యత అప్పజెప్పారు.
శ్రీధర్‌బాబు మళ్లీ ఓడిపోతాననే భయంతో ఇలాంటి వాటిని ప్రేరేపిస్తున్నారు. నా ఆస్తులపైనా రాద్ధాంతం చేస్తున్నారు. హైదరాబాద్‌లో సినీనటుడు శ్రీహరి ఇంటి పక్కన కోట్ల రూపాయల విలువైన ప్లాట్ ఉందని ఏమీ తెలుసుకోకుండానే మీడియా ప్రచురించింది, ప్రసారం చేసింది. పూరిగుడిసెలో పుట్టి ఎమ్మెల్యే అయిన నాలాంటి వాడికి కోట్ల రూపాయల ప్లాట్ సంపాదించడం సాధ్యమవుతుందా... ఎమ్మెల్యే అయిన తర్వాత ఏడు వందల కోట్లు సంపాదించానని అంటున్నారు.
అదే నిజమైతే ప్రజాస్వామ్యం బతికి బట్టగడుతుందా.. పేదలు ఎమ్మెల్యేలు కాకూడదా? దొంగలు ఫిర్యాదు చేస్తే ఏమీ తెలుసుకోకుండా మీడియా ప్రాధాన్యతనివ్వడం సమంజసమా? శ్రీధర్‌బాబు రచిస్తున్న నాటకాల్లో భాగంగానే నాపై కుట్ర జరుగుతోంది. నాపై వస్తున్న అసత్య ఆరోపణలకు సంబంధించి ఇకనైనా మీడియా వివరణ తీసుకుని ప్రచురించాలి. ఇలాంటి అసత్య వార్తలను నిలిపివేయాలని కోరుతున్నాను’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment