సాక్షి, హైదరాబాద్ : పార్టీ నాయకులపై, క్రమశిక్షణ కమిటీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. ఆయన వ్యవహారాన్ని పీసీసీ క్రమశిక్షణ కమిటీ చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీకి రాజగోపాల్‌రెడ్డి సోమవారం తన వివరణను షీల్డ్ కవర్‌లో అందజేశారు. గత శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో లో క్రమశిక్షణ కమిటీపై రాజగోపాల్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. తనకు నోటీసులు ఇచ్చే అర్హత క్రమశిక్షణ కమిటీ ఉందా? అంటూ రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పీసీసీ కమిటీల్లో బ్రోకర్లు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ఈవిధంగా కమిటీలను, కమిటీలు ఏర్పాటు చేసిన అధిష్టానాన్ని తన వ్యాఖ్యలతో రాజగోపాల్‌రెడ్డి అవమాన పరిచారని టీపీసీసీ భావిస్తోంది.
ఇప్పటికే పలుమార్లు రాజగోపాల్‌రెడ్డి నోరుపారేసుకున్నా వదిలేశామని, ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియా ముందు నోరుపారేసుకోవద్దని, పార్టీకి వ్యతిరేక చర్యలకు పాల్పడవద్దని, ఒకవేళ పాల్పడితే.. ఎంత పెద్ద నాయకులైనా చర్యలు తప్పవని పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పష్టం చేశారని, రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సైతం బేఖాతరు చేస్తూ.. రాజగోపాల్‌రెడ్డి బహిరంగ విమర్శలకు దిగటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని టీ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఎన్నికల కమిటీలను నియమించడం.. అందులో కోమటిరెడ్డి సోదరులకు అంతగా ప్రాధాన్యం దక్కకపోవడం తెలిసిందే. దీంతో అధిష్టాన దూత కుంతియతోపాటు సీనియర్ నేతలపై రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. దీంతో ఆయనకు క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు ఇవ్వగా.. నోటీసులు ఇచ్చిన క్రమశిక్షణ కమిటీని సైతం ఆయన అవమానించారని, దీని సహించే పరిస్థితి లేదని, సోమవారం మధ్యాహ్నం జరిగే క్రమశిక్షణ కమిటీ సమావేశంలో రాజగోపాల్ పై చర్యలు తీసుకొనే అవకాశముందని పార్టీ నేతలు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment