జానారెడ్డితో సమావేశమైన ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఓటమే లక్ష్యంగా కూటమి కట్టిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను తన వైపు మళ్లించుకునే వ్యూహాలకు పదును పెట్టింది. జనాభాలో సగభాగమున్న బీసీల ఓట్లను అనుకూలంగా మార్చుకునే క్రమంలో శుక్రవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, పలు బీసీ సంఘాల ప్రతినిధులతో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. దాదాపు 2 గంటల పాటు చర్చలు జరిపి బీసీల ప్రధాన డిమాండ్లను తెలుసుకున్నారు. జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు సగం సీట్లివ్వాలని, నిధుల కేటాయింపులో సమాన వాటా ఇవ్వాలని ఆర్.కృష్ణయ్య ప్రతిపాదించారు.
అరాచక పాలనను అంతం చేద్దాం: జానా
రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక, అప్రజాస్వామిక పాలనను అంతం చేసేందుకు అందరూ కలసి రావాలని జానారెడ్డి కోరారు. ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన సీఎం కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. బీసీ సంఘాల ప్రతినిధులతో సమావేశం అనంతరం వారితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వెనకబడిన వర్గాలకు న్యాయం చేయడంలో అగ్రభాగాన ఉంటుందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.
టీఆర్‌ఎస్ పాక్షిక మేనిఫెస్టోపై స్పందిస్తూ గత ఆర్నెల్లుగా కాంగ్రెస్ చెబుతున్న అంశాలనే టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో చేర్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రకటించిన హామీలతో దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ సరిపోదన్న కేసీఆర్, కేటీఆర్‌లు ఇప్పుడు అవే హామీలను ఎలా కాపీ కొట్టారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో విశ్వసనీయత లేదని.. అందుకే అందరిని ఆకట్టుకునేందుకు కేసీఆర్ ఈ పనిచేశారని ఆరోపించారు. ప్రజలను భ్రమపెట్టి, మభ్యపెట్టే విధానం కాంగ్రెస్‌కు లేదని జానా వెల్లడించారు.
ప్రధాన డిమాండ్లివే..
217 అంశాలతో కూడిన బీసీ డిక్లరేషన్ ప్రకటన, రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్, బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్లకు వచ్చిన దరఖాస్తులన్నీంటి పరిష్కారం, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు, ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్, క్రీమీలేయర్ ఎత్తివేత.. లాంటి ప్రధాన డిమాండ్లను కృష్ణయ్య జానారెడ్డికి వివరించారు. దీనిపై ఆయన స్పంది స్తూ టీఆర్‌ఎస్ పార్టీ కంటే ఎక్కువ సీట్లిచ్చేలా కృషి చేస్తామని హామీనిచ్చారు. డిమాండ్లపై మేనిఫెస్టో కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బీసీ సంఘాల ప్రతినిధులకు చెప్పారు.
బీసీలకు సగం సీట్లు ఇవ్వండి: జాజుల
సాక్షి, హైదరాబాద్: ఆరవై ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను గౌర వించి తెలంగాణ ఇచ్చినట్లు.. ఈ ఎన్నికల్లో బీసీలకు సగం సీట్లు ఇవ్వాలని ఏఐసీసీ అధ్యక్షు డు రాహుల్‌గాంధీని బీసీ సంక్షే మ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరా రు. మేనిఫెస్టో, రాయితీలు, సబ్సిడీలను చూసి మోసపోయేందుకు బీసీలు సిద్ధంగా లేరని ఆయన స్పష్టం చేశారు.
రాజ్యాధికారంలో బీసీలకు వాటా కల్పించాలని, అప్పుడే బీసీ యువత ఓట్లు వేసేందుకు ముం దుకు వస్తారని పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీలో బీసీ వర్గానికి చెందిన 24 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు ఉన్నారని జాజుల తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయంగా బీసీలకు అన్యాయం జరుగుతుందని ఓ ప్రకటనలో వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment