నిలదీస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి
పేదవాడికి ఇళ్లు నిర్మించి ఇచ్చే పేరుతో ప్రభుత్వం వారిని అప్పుల పాల్జేస్తోందని, బ్యాంకు కంతులు, లబ్ధిదారుని వాటా చెల్లించడానికి తెచ్చే అప్పులకు వడ్డీలు చెల్లించలేక చివరకు జైలు పాలయ్యే పరిస్థితి తెచ్చిపెట్టారని ప్రొద్దుటూరు శాసనసభ్యుడు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పేదవాడు అప్పు చేయ కుండా ఇల్లు నిర్మించి ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. ఈ అంశంపై చర్చను పక్క దారి పట్టించేలా మంత్రులు సోమిరెడ్డి, ఆదినారాయణరెడ్డి వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఆయన నేల మీద కూర్చున్నారు. రాచమల్లుకు మద్దుతుగా వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు స్వరం కలపడంతో మంత్రులు సమాధానం చెప్పలేక అజెండా ప్రారంభం కాకుండానే మంగళవారం జెడ్పీ సమావేశాన్ని ముగించి వెళ్లిపోయారు.
కడప : గృహ నిర్మాణ పథకంపై జెడ్పీ సమావేశం దద్దరిల్లింది. పేదలను ఇబ్బందులకు గురిచేసే విధంగా ఉన్న పథకంపై వాడీవేడి చర్చ జరిగింది. సరైన సమాధానం చెప్పలేక అధికారపార్టీ పలాయనం చిత్తగించింది. చర్చను పక్కదారి పట్టించింది. జెడ్పీ చైర్మన్ గూడూరు రవి అధ్యక్షతన మంగళవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ప్రతిజ్ఞ చేశారు. సమావేశం ప్రారంభం కాగానే ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి పట్టణ గృహ నిర్మాణ పథకం మీద మాట్లాడారు. పట్టణాల్లోని పేదలకు 3 సెంట్లలో ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి ఇప్పుడేమో ముక్కాల్ సెంటు, సెంటు, సెంటు కంటే కొంచె ఎక్కువ స్థలంలో ఇళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతోందని మంత్రులను నిలదీశారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.3.65 లక్షలు ఇస్తే ఈ ఇల్లు తనఖా పెట్టుకుని బ్యాంకు 9 శాతం వడ్డీతో రూ.3లక్షల లోను ఇస్తుందని, దీన్ని 30ఏళ్లు కంతులు కట్టాలన్నారు. రిక్షా తొక్కే వాళ్లు, కూలి పనిచేసుకునే వాళ్లు లబ్ధిదారుని వాటా కింద మొదట రూ.లక్ష కట్టాలని, తర్వాత 30ఏళ్లు లోను, కంతులు కలిపి నెలకు రూ.7వేలు చెల్లించాలన్నారు. ఇందంతా పేదవాడు చేసుకోగలడా అని మంత్రులను ప్రశ్నించారు. కంతులు సక్రమంగా కట్టకపోతే బ్యాంకు వాళ్లు ఇల్లు జప్తు చేసి జైలుకు పంపించరా? అని రాచమల్లు ప్రశ్నించారు.
ప్రజల కోసం ప్రశ్నిస్తా..
జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కల్పించుకుని ఇది అర్బన్‌కు సంబంధించిన విషయమని ఇక్కడ చర్చించకూడదన్నారు. ఏదైనా ఉంటే మీరు అసెంబ్లీకి రండి అక్కడ చర్చిద్దాం అన్నారు. జెడ్పీ సమావేశంలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన సమస్యలను మాత్రమే చర్చించాలన్నారు. దీనిపై ఎమ్మెల్యే రాచమల్లు స్పందిస్తూ గతంలో ఇదే సభలో సమైక్యాంధ్ర కోసం పలు తీర్మానాలు చేశారని ఇప్పుడు ఎందుకు చేయకూడదన్నారు. ఇదేమైన వేరే రాష్ట్రం సమస్యా? లేక నా వ్యక్తిగత సమస్య అని ఆయన ప్రశ్నించారు. ప్రజల సమస్యల గురించి ఎక్కడైనా ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు. ఈ దశలో మంత్రి ఆదినారాయణరెడ్డి, పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ ఎం.లింగారెడ్డి కల్పించుకుని జెడ్పీలో ఈ అంశం మీద చర్చించకూడదని ఎదురుదాడికి దిగారు. జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయనీ, జెడ్పీ సమావేశం అజెండాలో ఈ అంశం లేదని అభ్యంతరం చెప్పారు. ఒక దశలో రాచమల్లు, మంత్రి ఆది పరస్పరం విమర్శలు చేసుకున్నారు. లింగారెడ్డి కల్పించుకుని 300చదరపు అడుగుల లోపు ఇల్లు నిర్మించుకుంటే బ్యాంకు లోను తీసుకోవాల్సిన పనిలేదని చెప్పారు. ఈ సందర్భంలో లింగారెడ్డి, రాచమల్లు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ‘ చూడు మామ నువ్వు ప్రొద్దుటూరులో ఉన్నావ్. మల్లా టిక్కెట్ అడుగుతనావ్. ఇట్ల మాట్లాడితే ప్రజలు నీకు ఓటేయరు’’ అని రాచమల్లు పరోక్షంగా హెచ్చరించారు.
కాంట్రాక్టర్ల కోసమే..
ప్రభుత్వం అర్బన్ హౌసింగ్‌లో మంజూరు చేసే ఇళ్ల నిర్మాణాలు కాంట్రాక్టర్ల కోసం తప్ప లబ్ధిదారుల కోసం కాదని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి విమర్శించారు. ఇది కేవలం టీడీపీ నాయకులకు లబ్ధి చేకూర్చేందుకు తప్ప మరొకటి కాదన్నారు.
విషజ్వరాలతో చనిపోతున్నారు
జిల్లావ్యాప్తంగా అనేకమంది విషజర్వాలతో చనిపోతున్నా పట్టించుకునే వారే లేరని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి విమర్శించారు. ఒక్క పొద్దుటూరులోనే పదుల సంఖ్యలో చనిపోయారన్నారు. ప్రజలకు సేవచేయలేని పదవులు, మంత్రి పదవులు ఎందుకని ఆయన ప్రశ్నించారు.
ఒక్క పూరిగుడిసె లేకుండా చేశారు
వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఒక్క పూరిగుడిసె లేకుండా ప్రతి పేదవాడికి పక్కాఇల్లు నిర్మించి ఇచ్చారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంతరెడ్డి అన్నారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో పచ్చ చొక్కాలు తొడుకున్న ఎంతోమంది నాయకులు భవంతులు నిర్మించుకున్నారన్నారు. ఇప్పుడేమో ఈ ప్రభుత్వం పేదల ఇళ్లను బ్యాంకులో తనఖా పెట్టుకుని లోను మంజూరు చేస్తోందని దుయ్యబట్టారు.
సమస్యలపై చర్చించండి..
సభలో ఎవరు కూడా వ్యక్తిగత విమర్శలు చేసుకోరాదని, కేవలం జిల్లాలో ప్రజల సమస్యలను మాత్రమే మాట్లాడాలని జెడ్పీ చైర్మన్ గూడూరు రవి పదే పదే సభ్యులకు విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత విమర్శలకు దిగితే సహించేది లేదని ఏపార్టీ సభ్యులనైనా పోలీసులతో బయటకు పంపుతామని, అంతేకాకుండా మైక్ కూడా కట్ చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్యే జయరాములు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, కలెక్టర్ బాబురావునాయుడు, జేసీ శ్వేత, జెడ్‌పీ సీఈఓ ఆనంద్ సమావేశంలో పాల్గొన్నారు.
మంత్రిని నిలదీసిన సభ్యులు
వైఎస్ హయాంలో పులివెందులలో, రాష్ట్రంలో 4లక్షల ఇల్లు కనిపించకుండా పోయాయని మంత్రి సోమిరెడ్డి ఆరోపణలు చేశారు. దీంతో ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథరెడ్డి, ఎస్.రఘురామిరెడ్డి, జి. శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డితో పాటు పలువురు జెడ్‌పీటీసీలు, ఎంపీపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ హయాంలో అక్రమాలు జరిగి ఉంటే మూడేళ్లుగా మీరు అధికారంలో ఉండి ఎందుకు విచారణ చేయించలేకపోయారని నిలదీశారు. ఈ దశలో సభలో తీవ్రస్థాయిలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ రవి సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.
తర్వాత సభ ప్రారంభమయ్యాక పేదలకు భారం లేకుండా ఇల్లు నిర్మించి ఇవ్వాలని తీర్మానం చేయాలని చైర్మన్ రవి ప్రతిపాదించారు. ఇందుకు మంత్రి సోమిరెడ్డి అంగీకరించలేదు. ఈ దశలో ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతుండగా, జెడ్పీటీసీ సభ్యుడు పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడ్డుతగిలారు. ‘నువ్వు రాజకీయ వ్యభిచారివి నువ్వెందుకు మాట్లాడతావ్ కూర్చో’’ అని రాచమల్లు నిప్పులు చెరిగారు. దీంతో సభలో గందరగోళం రేగింది. 2015, 2016, 2017లో ఒక్క ఇల్లు కట్టకుండా 2018లో ఓట్ల కోసం ఇల్లు కట్టిస్తారా? అని మంత్రులను నిలదీశారు. వైఎస్సార్ గురించి ఆరోపణలు, విమర్శలు చేసే అర్హత ఎవరికీ లేదని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అభ్యంతరం చెప్పారు. ఈ దశలో ఎమ్మెల్సీ బీటెక్ రవి రాజకీయ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వాగ్వాదం, తోపులాటలు చోటుచేసుకోవడంతో చైర్మన్ రవి సభను నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో అజెండాలోని అంశాలు ప్రారంభం కాకుండానే సమావేశం ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment