సాక్షి,వైఎస్ఆర్‌జిల్లా: చంద్రబాబు ఇచ్చిన మాట తప్పి నవంబర్ ఒకటవ తేదీ నుంచి విద్యుత్ చార్జీలు పెంచనున్నారని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి విమర్శించారు. సోమవారం(అక్టోబర్ 28) ప్రొద్దుటూరులో రాచమల్లు మీడియాతో మాట్లాడారు.
‘ఎన్నికలకు ముందు ఐదు సంవత్సరాల వరకు విద్యుత్ చార్జీలు పెంచేది లేదని బాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట తప్పి నవంబర్ ఒకటవ తేదీ నుంచి విద్యుత్ చార్జీలు పెంచనున్నారు. ఎన్నికల ముందు ఒక మాట,ఇప్పుడు ఇంకో మాట సరైన పద్ధతి కాదు. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి..లేదంటే వైఎస్సార్‌సీపీ తీవ్రస్థాయిలో ఉద్యమిస్తుంది.
విద్యుత్ చార్జీలు పెరిగితే ప్రజల జీవితాలు గాడాంధకారంలోకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ప్రజలు 164 సీట్లు ఇచ్చి బాబుకు ఇస్తే, బాబు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలకు షాక్ ఇచ్చారు. మధ్య తరగతి ప్రజలపై అధిక భారం మోపనున్నారు. దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్ ధరల తగ్గింపు పేరు చెప్పి,విద్యుత్ చార్జీల రూపంలో దండుకుంటున్నారు.
నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ చార్జీలు పెంచి చేనేత,అమ్మ ఒడి,ఇతర సంక్షేమాలు రద్దు చేసి బాబు పాలన సాగిస్తున్నారు. రాష్ట్ర ఖజానాకు భారమైనా సరే రానున్న రోజుల్లో విద్యుత్ చార్జీలు పెంచకూడదు అని డిమాండ్ చేస్తున్నా. 2014 నుంచి 2019 వరకు బాబు పాలనలో దాదాపు 57 వేల కోట్లు విద్యుత్ కోసం అప్పు చేశారు. కోవిడ్ కాలంలో కూడా వైఎస్ జగన్ విద్యుత్ చార్జీలు పెంచలేదు. ఎలాంటి విపత్కర పరిస్థితి లేని ఈ సమయంలో బాబు ఎందుకు విద్యుత్ చార్జీలు పెంచుతున్నారు?
వైఎస్ జగన్ హయాంలో దళితులకు ఉచిత విద్యుత్ అందించి దాదాపు రూ. 650 కోట్ల రూపాయల విద్యుత్ సబ్సిడీ చెల్లించారు. మద్యం బెల్ట్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పి మద్యం ఏరులై పారేలా చేస్తున్నారు. ఐదు సంవత్సరాలు ఇలాగే పాలన కొనసాగితే రాష్ట్ర ప్రజలు అప్పుల్లో కూరుకుపోతారు. ప్రభుత్వం మెడలు వంచి ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు తగ్గించేలా పోరాడతాం. కరెంట్ ఆఫీసులను చుట్టుముడతాం,ఉద్యమం తీవ్రతరం చేస్తాం,దీక్షలకు పూనుకుంటాం’అని రాచమల్లు హెచ్చరించారు.
ఇదీ చదవండి: చంద్రబాబు ఇది మీరిచ్చిన వాగ్దానామే: వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment