
ఏపీసీసీ చీఫ్ రఘవీరారెడ్డి(పాత చిత్రం)
సాక్షి, విజయవాడ: రాఫెల్ కుంభకోణం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని ఏపీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి ఆరోపించారు. గురువారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ రిలయన్స్‌తో కుమ్మకై ఒక్కొ యుద్ద విమానం మీద 1000 కోట్లకు పైగా రాబందుల్లా దోచుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ మాత్రం అనుభవం లేని రిలయన్స్‌కు కాంట్రాక్టులు ఇవ్వడంలో జరిగిన అవినీతిని ఎండగడతామన్నారు. సెప్టెంబర్ 16 నుంచి 31 మధ్యలో రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు చేసి.. గవర్నర్ ద్వారా ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపు కేరళకు సహాయ చర్యలు ప్రారంభించామని వెల్లడించారు.
కేరళలో ఇళ్లు కొల్పోయిన వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున 1000 ఇండ్లు కట్టివ్వాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. 2019 లో కేంద్రంలో, రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజల్లో మార్పు వచ్చిందని.. కాంగ్రెస్ మళ్లీ పూర్వ వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం చేపడతామన్నారు. కర్నూలు జిల్లాలో రాహుల్ పర్యటన ఉంటుందని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని 97.8 శాతం మంది కోరుకుంటున్నారని తమ సర్వేలో తేలిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధ్యమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఎవరితోనూ పొత్తులు ఉండవని.. తాము సొంతంగానే పోటీ చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment