
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మార్చిలో ఢిల్లీలో జరపనున్న కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్ల కమిటీలో పాతతరం నేతలకే అధ్యక్షుడు రాహుల్ కీలక బాధ్యతలు అప్పజెప్పారు. ప్లీనరీ ఏర్పాట్లకోసం నియమించిన పలు కమిటీలను ఏఐసీసీ బుధవారం ప్రకటించింది. ఇందులో పలువురు పాతతరం నేతలకు ముఖ్యమైన బాధ్యతలు అప్పజెప్పారు. ప్లీనరీ నిర్వాహక కమిటీ బాధ్యతలను పార్టీ కోశాధికారి మోతీలాల్ వోరాకు అప్పగించగా.. కన్వీనర్‌గా ఆస్కార్ ఫెర్నాండెజ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇంచార్జ్‌లను నియమించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో డ్రాఫ్ట్ కమిటీకి వేశారు. ఈ కమిటీలోనూ సగానికిపైగా మంది వృద్ధ నేతలే. రాజకీయ తీర్మానాలను సిద్ధం చేసే కమిటీ బాధ్యతలను ఏకే ఆంటోనీకి అప్పగించారు. ఆర్థిక వ్యవహారాల కమిటీకి పి. చిదంబరం చైర్మన్ కాగా.. కన్వీనర్ జైరాం రమేశ్. పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీకి ఏ కమిటీలోనూ స్థానం కల్పించలేదు. స్టీరింగ్ కమిటీ పార్లమెంటు హౌజ్‌లో మార్చి 16వ తేదీన సమావేశమై తీర్మానాల తుదిజాబితాను సిద్ధం చేయనుంది. ప్లీనరీ మార్చి 17, 18 తేదీల్లో జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment