
రాయ్‌పూర్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి ఏ మాత్రం పోటీ కాదని చత్తీష్‌ఘడ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 40 నుంచి 50 స్థానాలకే పరిమితం కానుందని జోస్యం చెప్పారు. రాయ్‌పూర్‌లో మంగళవారం ఓ వార్త చానల్‌తో ముచ్చటించిన సీఎం పలు అంశాలపై చర్చించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతుందని, తిరిగి మోదీనే ప్రధాని కాబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ప్రజల మద్దతు మోదీకి ఉందని, 2014 ఫలితాల కంటే రానున్న ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో మోదీ నాయకత్వానికి పోటీ లేదన్నారు.
ఉత్తరప్రదేశ్, బిహార్‌లో నాలుగో స్థానానికి పడిపోయి బెంగాల్‌లో ఉనికే లేని కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఎలా ఎదుర్కొంటుందని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించేందుకే విపక్షాలు కూటమి కడుతున్నాయన్నారు. రాహుల్ గాంధీ, మాయావతి, మమతా బెనర్జీ, ములాయం సింగ్ యాదవ్ అందరూ ప్రధాని పదవి కోసమే కూటమిలో చేరుతున్నారని ఆరోపించారు. బీజేపీ మోదీ నాయకత్వంలోనే ఎన్నికల్లో పోటి చేస్తుందని తెలిపారు. పుల్‌పూర్, గోరఖ్‌పూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై స్పందించిన రమణ్‌సింగ్.. స్థానిక పరిస్థితులు ఒక్కో సారి ఉప ఎన్నికలపై ప్రభావం చూపుతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment